
తప్పును అంగీకరించిన ‘ఎక్స్’
ఎలాన్ మస్క్ కు చెందిన కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ ‘గ్రోక్’ నుంచి అశ్లీల కంటెంట్ తయారవుతోందన్న ఆరోపణలపై కేంద్ర ఐటీ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, మైక్రోబ్లాగింగ్ వేదిక ‘ఎక్స్’ తన తప్పును అంగీకరించింది. ఈ క్రమంలో సుమారు 3,500 అశ్లీల కంటెంట్ అంశాలను తొలగించి, 600కు పైగా ఖాతాలను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. భారత చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని, ఇకపై అశ్లీల చిత్రాలు, వీడియోలు లేదా అక్రమ సమాచారాన్ని అనుమతించబోమని ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. నోటీసుకు ‘ఎక్స్’ తొలుత ఇచ్చిన సమాధానం వివరంగా ఉన్నప్పటికీ, అశ్లీల కంటెంట్ తొలగింపు వివరాలు, భవిష్యత్తులో నివారణ చర్యలపై స్పష్టత లేకపోవడంతో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం మరిన్ని వివరాలు కోరింది. తాజా పరిణామాల్లో ‘ఎక్స్’ తన తప్పును అంగీకరించి, భారత చట్టాలకు పూర్తిగా లోబడి వ్యవహరిస్తామని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
జనవరి 2న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, ‘గ్రోక్’ ద్వారా రూపొందిన అసభ్య, అశ్లీల, అక్రమ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలంటూ ‘ఎక్స్’కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 72 గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది.
మహిళలను లక్ష్యంగా చేసుకున్న దుర్వినియోగం
‘గ్రోక్’ను ఉపయోగించి కొందరు వినియోగదారులు మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేయడం, అనుమతి లేకుండా ‘డిజిటల్ అన్‌డ్రెస్సింగ్’ చేయడం వంటి చర్యల ద్వారా లైంగిక అశ్లీల చిత్రాలు, వీడియోలు రూపొందిస్తున్నారని కేంద్రం గుర్తించింది. ఇది నకిలీ ఖాతాల వరకే పరిమితం కాకుండా, సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు పంచుకున్న మహిళలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంది. ఇది భద్రతా వ్యవస్థల లోపాన్ని స్పష్టంగా చూపిస్తోందని, కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నట్టేనని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
చట్టపరమైన హెచ్చరిక
మధ్య వర్తులకు సమాచార సాంకేతిక చట్టం కింద ఉన్న సెక్షన్ 79 ద్వారా లభించే రక్షణ నిబంధనలకు లోబడి వ్యవహరించినప్పుడే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్యూ డిలిజెన్స్ బాధ్యతలను విస్మరిస్తే, ఈ రక్షణ రద్దు అయి, సమాచార సాంకేతిక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. అశ్లీల కంటెంట్‌ను రూపొందించే లేదా పంచే వినియోగదారుల ఖాతాల సస్పెన్షన్, శాశ్వత రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’కు ఆదేశాలు ఇచ్చింది.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిస్పందనలు
ఈ వ్యవహారంపై భారత్‌తో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కూడా ‘ఎక్స్’పై ఒత్తిడి పెంచాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ ఘటనను అత్యంత అసహ్యకరమైనదిగా అభివర్ణించారు. బ్రిటన్ నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్, పిల్లలకు సంబంధించిన లైంగిక చిత్రాలు రూపొందుతున్నాయన్న ఆరోపణలపై ‘ఎక్స్’ ‘ఎక్స్‌ఏఐ’ సంస్థలను సంప్రదించామని తెలిపింది. వారి స్పందన ఆధారంగా దర్యాప్తు చేపడతామని పేర్కొంది. అమెరికాలో ముగ్గురు డెమోక్రటిక్ సెనేటర్లు, నిబంధనల ఉల్లంఘన కారణంగా ‘ఎక్స్’ ‘గ్రోక్’ను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్‌లకు లేఖ రాశారు.
