
తప్పుడు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు
ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులతో పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే నిరూపించాలని సవాల్ విసిరారు. మరోసారి తప్పుడు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పరిటాల కుటుంబం ఒకరికి ఇచ్చే కుటుంబమే కానీ తీసుకునే కుటుంబం కాదని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిందని పరిటాల సునీత అన్నారు. సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని మొత్తం 1752 మందికి 2 కోట్ల 63 లక్షల రూపాయల మెగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. అయినప్పటికీ చంద్రబాబు సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పరిటాల సునీత చెప్పారు. గత ప్రభుత్వంలో 10 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అది కూడా వైసీపీ వారికే ఇచ్చారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.463 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేసి, 2 లక్షల 90 వేల మందికి పథకాన్ని వర్తింపజేస్తున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లు నిత్యం కష్టపడుతూ ఉంటారని, ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు ఆటో నడపాలని కోరారు. చిన్న పొరపాటు కూడ పెద్ద నష్టాన్ని మిగులుస్తుందని గుర్తు చేశారు. అందుకే ఒక అమ్మగా, అక్కగా ఈ సూచన చేస్తున్నట్టు పరిటాల సునీత తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో సంతృప్తినిస్తున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
