
తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతది!: మంత్రి సీతక్క
అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేస్తే "చెప్పు తెగుతుంది" అంటూ ఆమె ఘాటుగా హెచ్చరించారు.
ములుగులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలులో స్కాం జరిగిందంటూ వస్తున్న కథనాలను మంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారమే, అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ డిజిటల్ స్థలం పోర్టల్ ద్వారా ఓపెన్ టెండర్ విధానంలో ఈ కొనుగోలు జరిగిందని ఆమె తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు రూ.11,650కు ఫోన్లు కొంటే, రూ.14వేలు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసహనంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఎవరైనా ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
