Let's talk: editor@tmv.in
తప్పుడు ప్రచారం చేస్తున్నారు:మమతా బెనర్జీ

తప్పుడు ప్రచారం చేస్తున్నారు:మమతా బెనర్జీ

Pinjari Chand
7 నవంబర్, 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఫారమ్‌ను స్వీకరించిందని వస్తున్న వార్తలను తప్పుడు, గందరగోళపూరితమైన, ఉద్దేశపూర్వక ప్రచారంగా చేస్తున్నట్లు కొట్టిపారేశారు. గురువారం బెంగాల్‌లో కొన్ని మీడియా సంస్థలు నేను ఇంటి బయటకు వచ్చి స్వయంగా ఫారమ్‌ స్వీకరించారు అని ప్రచారం చేశాయి. ఇది పూర్తిగా అబద్ధమని మమతా బెనర్జీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఆమె తెలిపిన ప్రకారం, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) బుధవారం ఆమె కాలీఘాట్ నివాస ప్రాంతానికి వచ్చి, అక్కడి కొందరికి ఫారమ్‌లు ఇచ్చారని, అయితే తాను ఆ ఫారమ్‌ను స్వీకరించలేదని స్పష్టం చేశారు.ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం నవంబర్ 4న ఆమె ఎస్ఐఆర్ ఫారమ్‌ను స్వీకరించారని పేర్కొన్నప్పటికీ మమతా బెనర్జీ ఆ వార్తలను పూర్తిగా తిరస్కరించారు.

ఇదివరకు కూడా ఆమె కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.పశ్చిమ బెంగాల్ తో సహ మరో 11 రాష్ట్రాలలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ను బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ద్వారా బీజేపీ నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపించారు. 2016లో మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశానికి నల్లధనం తిరిగి తీసుకురాలేదని కూడా ఆమె విమర్శించారు.

ఎన్నికల సంఘం ప్రకారం, రెండో దశ ఎస్ఐఆర్ అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే అంశంపై మమతా బెనర్జీ ప్రజలందరూ ఫారమ్‌లు నింపకపోతే నేను నింపను అని తన నిర్ణయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు.

ఎలక్షన్ కమిషన్ ప్రకారం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ముద్రణ, శిక్షణ జరుగుతుంది. తరువాత నవంబర్ నుంచి డిసెంబర్ 4 వరకు గణన దశ ఉంటుంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా డిసెంబర్ 9న ప్రచురిస్తారు. తరువాత డిసెంబర్ 9 నుంచి జనవరి 8, 2026 వరకు క్లెయిమ్‌లు అభ్యంతరాల వ్యవధి ఉంటుంది.