Let's talk: editor@tmv.in
తాంత్రిక వైద్యం పేరుతో భారీ మోసం

తాంత్రిక వైద్యం పేరుతో భారీ మోసం

Panthagani Anusha
27 సెప్టెంబర్, 2025

భారతదేశంలో ప్రత్యేకించి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రజల అమాయకత్వం వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని క్షుద్రపూజలు, చేతబడి, తాంత్రిక వైద్యం పేరుతో జరిగే మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఇంకా బలంగా ఉన్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఒకటి నవీ ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏకంగా ఆరేళ్ల పాటు వేధించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు.

అనారోగ్యంతో ఉన్న తన తల్లికి 'తాంత్రిక వైద్యం' చేయిస్తామనే నెపంతో ఒక 22 ఏళ్ల యువకుడి నుంచి ఆరుగురు వ్యక్తులు ఏకంగా రూ.3.10 కోట్లు కాజేశారు. నెరుల్‌కు చెందిన బాధితుడు తేజస్ ఘోడేకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 2019 నుండి ఫిబ్రవరి 2025 వరకు ఈ నేరం జరిగినట్లు తేజస్ తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్మించి

ఈ కేసులో ముస్తఫా షేక్ అలియాస్ కాంబ్లే, ఆహత్ షేక్, సఫీనా నానూ షేక్, నానూ షేక్, వసీం షేక్, రఫిక్ షేక్ అనే ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వీరంతా పాల్ఘర్ జిల్లాలోని సఫాలే నివాసులు. తమకు "ప్రత్యేక శక్తులు" ఉన్నాయని వాటితో ఘోడేకర్ తల్లి అనారోగ్యాన్ని నయం చేయగలమని నిందితులు అతన్ని నమ్మించారు. తల్లి పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న బాధితుడు నేరస్థుల మాటలు నమ్మి ఈ ఆరేళ్లలో విడతలవారీగా వారికి మొత్తం రూ.3.10 కోట్లు చెల్లించాడు. కాగా తేజస్ ఘోడేకర్ చెల్లించిన మొత్తంలో తన సొంత డబ్బుతో పాటు అప్పులు చేసి తెచ్చిన డబ్బు ఉన్నట్లు సమాచారం.

అయితే చికిత్స జరగకపోవడంతో ఘోడేకర్ తన డబ్బును తిరిగి ఇవ్వమని పదేపదే డిమాండ్ చేశాడు. నిందితులు కేవలం రూ.19 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి మిగిలిన రూ. 2.91 కోట్లు తిరిగి ఇవ్వకుండా దాటవేశారు. దీంతో తేజస్ డబ్బు కోసం గట్టిగా నిలదీయగా నిందితులు అతడిని అతడి కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించారు. అంతేకాకుండా బ్లాంక్ స్టాంప్ పేపర్‌లపై సంతకాలు చేయాల్సిందిగా తేజస్ ను బలవంతం చేశారు.

బ్లాక్ మ్యాజిక్ చట్టం కింద కేసు నమోదు

ఘోడేకర్ ఫిర్యాదు మేరకు నిందితులపై మోసం, నేరపూరిత బెదిరింపు వంటి సెక్షన్లతో పాటు మత విశ్వాసాల పేరుతో జరిగే దోపిడీని నేరంగా పరిగణించే మహారాష్ట్ర మానవ బలి, ఇతర అమానవీయ, దుష్ట, అఘోరా పద్ధతులు, బ్లాక్ మ్యాజిక్ నిరోధక చట్టం, 2013 కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం మూఢనమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

తాంత్రిక వైద్యం పేరుతో భారీ మోసం - Tholi Paluku