Let's talk: editor@tmv.in
తాటికోండ రాజయ్య గృహనిర్భంధం

తాటికోండ రాజయ్య గృహనిర్భంధం

Gaddamidi Naveen
16 సెప్టెంబర్, 2025

వరంగల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పేరుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ పరిణామానికి ప్రధాన కారణం స్టేషన్ ఘన్పూర్ పార్టీ ఫిరాయింపుదారు అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియంపై రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయగా, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాజయ్యను పోలీసులు ఆయన నివాసంలోనే నిర్బంధించారు.రాజయ్య గృహ నిర్బంధ వార్త తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. రాజయ్యకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ పద్ధతులు ప్రజాస్వామ్య విరుద్ధం అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా కొనసాగుతోంది.బీఆర్ఎస్ నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య హక్కులను హరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగసూత్రాలకు విరుద్ధమని, ఇలాంటి అక్రమ అరెస్టులను తాము ఊహించలేమని మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అవకాశవాదులంతా కడియం శ్రీహరి వెంట ఉన్నారని,రానున్న రోజుల్లో కడియం శ్రీహరి కచ్చితంగా రాజీనామా చేస్తాడని, లేదంటే సుప్రీం కోర్టు తీర్పుతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించే అవకాశముందన్నారు. ఏడాది క్రితం తాను కాంగ్రెస్లో చేరానని పబ్లిక్ మీటింగ్లో శ్రీహరే స్వయంగా చెప్పారని, దానినే స్పీకర్కు లిఖిత పూర్వకంగా అందజేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తానని రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ప్రజలు ఎవరి పక్షన ఉన్నారో తెలుస్తుందన్నారు. కడియం శ్రీహరి అధికారంలో ఏ పార్టీ ఉన్న ఆ కండువా కప్పుకుంటాడని రాజయ్య ఎద్దేవా చేశారు.

తాటికోండ రాజయ్య గృహనిర్భంధం - Tholi Paluku