
తేజస్వీ యాదవ్ పర్యటనలో భద్రతాలోపం
ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ కు అనుకోని సంఘటన ఎదురైంది. హెలికాప్టర్ ఎక్కేందుకు సిద్ధమయ్యే సమయంలో ఓ యువకుడు దూసుకొచ్చి ఆయనను కలిశారు. కలిసిందే కాకుండా కాళ్లపై పడ్డాడు. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు లొనయ్యారు. అధికారులు అప్రమత్తమై ఆ యువకుడిని బయటకి పంపించేశారు.
సెక్యూరిటీని దాటుకుని
తేజస్వీ యాదవ్ ముజఫర్ పూర్ జిల్లాలోని కాంతి పాఠశాలలో శనివారం రాత్రి బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ఆదివారం తిరిగి బయలుదేరే సమయంలో హెలికాప్టర్ దగ్గర భారీగా భద్రత ఉన్నప్పటికీ ఓ యువకుడు దూసుకు రావడంతో అధికారుల్లో కలకలం రేగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. షరీపుల్ ఇస్లాంగా అతడిని గుర్తించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనక సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఇది తీవ్రమైన భద్రతా లోపమని, అధికారులు అలర్ట్ గా ఉండాలని కొందరు నెటిజన్లు విమర్శించారు. మరికొందరు ఇది తేజస్వీపై ఉన్న అభిమానానికి నిదర్శనమని కొనియాడారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు. ఓట్ అధికార్ యాత్రలోనూ ఈ విధంగా జరిగింది.
