Let's talk: editor@tmv.in
తక్షణమే ఇరాన్‌‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా కీలక అడ్వైజరీ

తక్షణమే ఇరాన్‌‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా కీలక అడ్వైజరీ

Shaik Mohammad Shaffee
7 ఫిబ్రవరి, 2026

ఇరాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఉంటున్న తమ పౌరులు తక్షణమే ఇరాన్‌ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు, రహదారుల మూసివేత, ప్రజా రవాణాకు అంతరాయం కలగడమే కాకుండా.. మొబైల్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

తక్షణమే దేశం విడిచి వెళ్ళండి!

విమాన సర్వీసులు ఎప్పుడైనా రద్దు కావచ్చని, కాబట్టి విమానాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దేశం దాటాలని సూచించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లడం సాధ్యం కాకపోతే, తమ నివాసాల్లోనే ఆహారం, నీరు, మందులు వంటి కనీస అవసరాలను సిద్ధం చేసుకుని సురక్షితంగా ఉండాలని తెలిపింది. ప్రదర్శనలు జరిగే చోటుకు వెళ్లవద్దని, ఇరాన్ ప్రభుత్వ నిఘా ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రోడ్డు మార్గాలపై అమెరికా సూచనలు

విమాన ప్రయాణాలు అందుబాటులో లేని పక్షంలో, అమెరికా పౌరులు రోడ్డు మార్గం ద్వారా పొరుగు దేశాలకు వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం అర్మేనియా సరిహద్దులు (అగారక్/నార్డజ్) తెరిచి ఉన్నాయి, అక్కడ అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారు 180 రోజుల వరకు వీసా లేకుండా ఉండవచ్చు. అలాగే టర్కీ సరిహద్దు మార్గాలు (గుర్బులక్, కాపికోయ్, ఎసెండెరే) కూడా అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ 90 రోజుల వరకు వీసా రహిత ప్రవేశానికి అవకాశం ఉంది. అయితే, ఈ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని హెచ్చరించింది.

నిబంధనలు.. నిషేధిత ప్రాంతాలు

మరికొన్ని దేశాలకు వెళ్లాలంటే కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. తుర్క్మెనిస్తాన్ సరిహద్దులు తెరిచి ఉన్నప్పటికీ, అక్కడి ప్రభుత్వం నుంచి ముందస్తుగా ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అజర్‌బైజాన్ సరిహద్దులు సాధారణ ప్రయాణికుల కోసం మూసివేయబడ్డాయి, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక అనుమతితో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్థాన్ సరిహద్దుల వైపు అసలు వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం తన పౌరులను గట్టిగా హెచ్చరించింది.

ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి ముప్పు!

అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించదని, వారిని కేవలం ఇరాన్ పౌరులుగానే పరిగణించి అరెస్టు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికాతో సంబంధం ఉన్నట్లు తెలిస్తే ఇరాన్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నందున లో-ప్రొఫైల్ మెయింటెన్ చేయాలని సూచించింది.

సహాయం కోసం సంప్రదించండి..

ఇరాన్‌తో అమెరికాకు నేరుగా దౌత్య సంబంధాలు లేవు. కాబట్టి టెహ్రాన్‌లోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం ద్వారా అమెరికా ప్రయోజనాలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కావాల్సిన వారు టెహ్రాన్‌లోని స్విస్ ఎంబసీని (+98-21-22-54-21-78) లేదా అంకారా, యెరెవాన్, బాకులోని అమెరికా రాయబార కార్యాలయాలను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది. అలాగే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి 'స్టెప్' ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

తక్షణమే ఇరాన్‌‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా కీలక అడ్వైజరీ - Tholi Paluku