.jpeg)
తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జీ ఎవరు ?
తంబళ్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీ వెలుగు చూడటం టీడీపీకి తలనొప్పిగా మారింది. టీడీపీ ఇంచార్జీ జయచంద్రారెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనను టీడీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపికి నడిపించే నాయకుడు లేరు. కొత్త ఇంచార్జీ కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఎవరిని ఇంచార్జీగా నియమించాలి అన్న మీమాంస టీడీపీలో మొదలైంది. జయచంద్రారెడ్డి వ్యవహారం టీడీపీకి కోలుకోలేని అంశంగా మారడంతో.. కొత్త ఇంచార్జీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న నిర్ణయం టీడీపీ అధిష్టానం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మొన్నటి వరకు టీడీపీ ఇంచార్జీగా ఉన్న జయచంద్రారెడ్డిని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా టీడీపీ తేల్చేసింది. దీంతో ఇప్పుడు తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జీ ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. తమ నాయకుడికి ఇంచార్జీ పదవి అప్పగించాలని కోరారు. శంకర్ యాదవ్ కూడా తన అభ్యర్థనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం, గ్రామ స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు ఉండటం శంకర్ యాదవ్ కు కలిసొచ్చే అంశం.
శంకర్ యాదవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఇంచార్జీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో శంకర్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి తల్లి కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంచార్జీ పదవి కోసం కీలకంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా కొండా నరేంద్ర అనే ఎన్ఆరై కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అధిష్టానం మాత్రం జయచంద్రారెడ్డి వల్ల జరిగిన డ్యామేజీతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. శంకర్ యాదవ్ కు నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ.. ఆయనను వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. పార్టీలో వర్గాలకు ఆజ్యం పోసింది శంకర్ యాదవే అన్నది మరోవాదన. ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఆయన నిలకడలేని తత్వం ఇబ్బందిగా మారుతుందనే అంచనా టీడీపీలో ఉంది. ఇక ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ.. రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి. కాబట్టి ముగ్గురి విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నది టీడీపీ నిర్ణయం. కొంత సమయం తీసుకుని, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇంచార్జిని ప్రకటించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
