Let's talk: editor@tmv.in
ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణం

ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణం

Pinjari Chand
29 అక్టోబర్, 2025

ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరిగింది. జస్టిస్ దినేష్ మెహతా, అవనీష్ జింగన్, చంద్రశేఖరన్ సుధాలు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయమూర్తులు, అడ్వకేట్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, న్యాయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ఈ ముగ్గురికి స్వాగతం తెలుపుతూ ఢిల్లీ హైకోర్టులో వీరి సేవలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

వేర్వేరు రాష్ట్రాల నుంచి బదిలీ

కేంద్ర న్యాయశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ అవనీష్ జింగన్, కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ చంద్రశేఖరన్ సుధాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ బదిలీలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 222(1) ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో జరిగాయి.

సుప్రీం కొలీజియం సిఫారసు

సుప్రీం కోర్టు కొలీజియం ఆగస్టు 27న చేసిన సిఫారసుల మేరకు ఈ బదిలీలు జరిగాయి. సీజేఐ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఈ ముగ్గురి బదిలీతోపాటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుుణ్ మోంగా (రాజస్థాన్ హైకోర్టుకు), జస్టిస్ తారా విటస్త గంజూ (కర్ణాటక హైకోర్టుకు) బదిలీకి కూడా సిఫారసు చేసింది. వీరికి సోమవారం ఫుల్‌కోర్టు సమావేశంలో వీడ్కోలు పలికారు. ఈ బదిలీలతో ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీ క్రమంలో మార్పు చోటుచేసుకుంది. పది మందిలో ఆరుగురు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాల హైకోర్టుల నుంచి బదిలీ అయినవారే కావడంతో, ప్రధాన పరిపాలనా కమిటీలు, ముఖ్యంగా జనరల్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రూపకల్పనలో మార్పులు రావచ్చని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే ఏడాది జులై లో ఆరుగురు న్యాయమూర్తులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. వారిలో వీ.కామేశ్వర్ రావు, నితిన్ వాసుడియో సాంబ్రే, వివేక్ చౌదరి, అనిల్ క్షేత్రపాల్, అరుణ్ కుమార్ మోంగా, ఓం ప్రకాశ్ శుక్లా.

జూలైలోనే వచ్చిన మోంగా.. అప్పుడే బదిలీ

జస్టిస్ అరుణ్ కుమార్ మోంగాను ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. కానీ చాలా తక్కువ వ్యవధిలోనే మళ్లీ ఆయనను తిరిగి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ మోంగా రాజస్థాన్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన 2025 జూలై 21న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం ఒక నెలలోపే, సుప్రీం కోర్టు కొలీజియం ఆయనను తిరిగి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఈ నిర్ణయం 2025 ఆగస్టు 27న సీజీఐ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశంలో తీసుకున్నారు.