Let's talk: editor@tmv.in
ఢిల్లీ, సిలిగురిలో బంగ్లాదేశ్ వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేత

ఢిల్లీ, సిలిగురిలో బంగ్లాదేశ్ వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేత

Shaik Mohammad Shaffee
24 డిసెంబర్, 2025

భారత్‌లోని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరాల్లో బంగ్లాదేశ్ వీసా సేవలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. దీనివల్ల బంగ్లాదేశ్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ప్రస్తుతం వీసాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట కొందరు వ్యక్తులు గుమిగూడిన ఘటన చోటు చేసుకున్నదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత తమ కార్యాలయ భద్రతపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ నుంచి ఎలాంటి వీసాలు జారీ చేయడం లేదని వెల్లడించారు.

సిలిగురి విషయానికి వస్తే, అక్కడ బంగ్లాదేశ్‌కు అధికారిక దౌత్య కార్యాలయం లేదు. అయితే ప్రైవేట్ సంస్థ అయిన వీఎఫ్‌ఎస్ ద్వారా వీసా సేవలు అందించేవారు. ఇటీవల అక్కడ వీఎఫ్‌ఎస్ కార్యాలయంపై దాడి జరిగిందని, బెదిరింపులు వచ్చాయని బంగ్లాదేశ్ అధికారులు ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిలిగురిలో కూడా వీసా సేవలను నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఆ కథనాలు అవాస్తవం: భారత్

ఇదిలా ఉండగా, ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసనపై బంగ్లాదేశ్ మీడియాలో వచ్చిన కథనాలను భారత్ తప్పుదారి పట్టించే ప్రచారంగా కొట్టిపారేసింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్దిమంది యువకులు నిరసన చేపట్టారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ ప్రాంతంలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు గురైన ఘటనను నిరసిస్తూ, సుమారు 20 నుంచి 25 మంది యువకులు డిసెంబర్ 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నినాదాలు చేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిరసన చాలా స్వల్పసేపే జరిగిందని, ఎలాంటి భద్రతా సమస్య తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు.

హైకమిషన్ గేట్లు దాటేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని, అక్కడ ఉన్న పోలీసులు కొద్ది నిమిషాల్లోనే గుంపును చెదరగొట్టారని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అందరికీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వియన్నా కన్వెన్షన్ ప్రకారం విదేశీ దౌత్య కార్యాలయాల భద్రతకు భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అనివార్య కారణాల వల్ల అన్ని కాన్సులర్, వీసా సేవలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో, భద్రతా ఘటన నేపథ్యంలో భారత్ కూడా చిట్టగాంగ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్‌లో వీసా సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అక్కడ పరిస్థితులు పూర్తిగా సమీక్షించిన తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

కోల్‌కతాలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌లో మాత్రం వీసా సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అలాగే అసోం, ముంబయి ప్రాంతాల్లో కూడా వీసా సేవలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, సిలిగురి కేంద్రాల్లో మాత్రమే బంగ్లాదేశ్ వీసా సేవలు నిలిచిపోయాయని స్పష్టం చేశారు.

ఢిల్లీ, సిలిగురిలో బంగ్లాదేశ్ వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేత - Tholi Paluku