Let's talk: editor@tmv.in
ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ బోర్డులో 5,346 ఉద్యోగాలు

ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ బోర్డులో 5,346 ఉద్యోగాలు

Shaik Mohammad Shaffee
6 అక్టోబర్, 2025

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌గా స్థిరపడాలనుకునే వారికి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి డీఎస్ఎస్ఎస్‌బీ తాజాగా అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇంగ్లిష్‌, నేచురల్ సైన్స్, సోషల్ సైన్స్, సంస్కృతం, హిందీ, పంజాబీ, ఉర్దూ, గణితం సబ్జెక్టులలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 9 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు విడుదల కావడంతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ డిగ్రీ (కనీసం 50 శాతం మార్కులతో) కలిగి ఉండాలి. బీఈడీ లేదా దానికి సమానమైన డిగ్రీ తప్పనిసరి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్-2లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుడు 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా, ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, ఓబీసీ (ఢిల్లీ) అభ్యర్థులకు 35 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ/పీడబ్యూడీ అభ్యర్థులకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.

అర్హులైన అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ dsssbonline.nic.inను సందర్శించాలి. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, నోటిఫికేషన్ నెం.06/2025 కింద టీజీటీ పోస్టుల లింక్‌ను క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపి, అవసరమైన పత్రాలను (ఫోటో, సంతకం) అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించి (వర్తించే వారికి), ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

ఎంపికైన అభ్యర్థులకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం లెవల్-7 కింద నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు జీతం లభిస్తుంది. ఈ డీఎస్ఎస్ఎస్‌బీ టీజీటీ నోటిఫికేషన్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కోరుకునే వారికి గొప్ప అవకాశం. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ dsssbonline.nic.inలో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.

ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ బోర్డులో 5,346 ఉద్యోగాలు - Tholi Paluku