Let's talk: editor@tmv.in
ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించండి : హరీష్ రావు

ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించండి : హరీష్ రావు

T Venkata Ramana
10 అక్టోబర్, 2025

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో బీసీలను ఎలా మోసం చేసిందో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతోనూ అదే డ్రామాను కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిపై బీఆర్‌ఎస్ నాయకత్వం పలు ప్రశ్నలు సంధిస్తూ కీలక డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

పక్కదారి పడుతున్నడక్లరేషన్

ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేవలం రాష్ట్ర స్థాయిలో జీవో 9 జారీ చేసి తూతూ మంత్రంగా కొత్త నాటకానికి తెరతీయకుండా, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాలి అని డిమాండ్‌ చేసింది.

కేంద్రంపై పోరాటం ఎందుకు చేయరు?

55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పాటుపడిందా అని బీఆర్‌ఎస్ ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను దాటి రిజర్వేషన్లు అమలు చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేసి షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం ఉందని ఈ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం 22 నెలలుగా ఢిల్లీలో కొట్లాడాల్సిన కాంగ్రెస్ గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసింది తప్ప 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని హరీష్ రావు మండిపడ్డారు.

యుద్ధ భేరి మోగించండి

"రేవంత్ రెడ్డి గారూ! ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యూల్ 9లో చేర్చండి. అని హరీష్ రావు డిమాండ్‌ చేశారు. "బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలన, ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలని

బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందన్నారు హరీష్ రావు. ఈ పోరాటంలో కలిసి రావడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెం 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేయడం వంటి పరిణామాలు కాంగ్రెస్ చిత్తశుద్ధిపై మరింత అనుమానాలు పెంచేలా చేశాయని బీఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఎన్నికల లబ్ధి కోసం చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి అనడానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది.

ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించండి : హరీష్ రావు - Tholi Paluku