
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 300కి పైగా విమానాలు ఆలస్యం
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 300కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్యల కారణంగా విమానాశ్రయంలోని అన్ని ఎయిర్‌లైన్ల కార్యకలాపాలపై ప్రభావం పడింది. అధికారులు సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకారం, విమాన ట్రాఫిక్ నియంత్రణ డేటాను సమన్వయం చేసే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్ఎస్)లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ ఆలస్యం జరిగింది. సాంకేతిక సమస్యలు గురువారం సాయంత్రం నుంచే మొదలైనట్లు సమాచారం. ఏఎంఎస్ఎస్ లోపం కారణంగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆటోమేటిక్‌గా ఫ్లైట్ ప్లాన్‌లను పొందలేకపోతున్నారు.
సిస్టమ్ సమస్యలు కొనసాగుతున్నందున, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాతో మాన్యువల్‌గా ఫ్లైట్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో, అనేక విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యల వల్ల విమానాశ్రయంలో విమానాల రాకపోకల రద్దీ కూడా పెరిగింది.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రోజుకు 1,500 కంటే ఎక్కువ విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24.comలోని సమాచారం ప్రకారం, 300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. బయలుదేరే విమానాలకు సగటు ఆలస్యం సుమారు 50 నిమిషాలుగా ఉంది.
ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌తో సహా అన్ని ప్రముఖ ఎయిర్‌లైన్స్ తమ విమానాలు ఆలస్యం అయినట్లు ప్రకటించాయి. విమానాశ్రయం టెర్మినల్స్‌లో బోర్డింగ్ గేట్ల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. వందలాది మంది ప్రయాణికులు తమ విమాన సమయాల అప్‌డేట్‌ల కోసం వేచి చూస్తూ ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న డీఐఏఎల్, ఏఎంఎస్ఎస్ లోపం కారణంగా కార్యకలాపాలు అంతరాయం చెందాయని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఏఎంఎస్ఎస్, ఉత్తర ప్రాంతంలోని కొన్ని ఇతర విమానాశ్రయాలలో కూడా ఆలస్యానికి కారణమైందని ఇండిగో తెలిపింది. ప్రభుత్వ ఆధీనంలోని ఏఏఐ, ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సాంకేతిక బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది.
