
ఢిల్లీ విమానాశ్రయంలో కోటి విలువైన బంగారం పట్టివేత
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. దాదాపు రూ. 1.17 కోట్ల విలువైన బంగారంతో అక్రమంగా ప్రయాణిస్తున్న మయన్మార్‌కు చెందిన ఓ మహిళను శనివారం అరెస్టు చేసినట్లు కస్టమ్స్ శాఖ వెల్లడించింది. కాగా మహిళా వద్ద నుండి సుమారు ఒక కేజీ బంగారం 6 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
లోదుస్తుల్లో దాచిన బంగారు కడ్డీలు
నిందితురాలిని శుక్రవారం యాంగాన్ (మయన్మార్) నుంచి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ సిబ్బంది సాధారణ తనిఖీలో భాగంగా ఆమె ధరించిన నల్లటి లోదుస్తుల్లో ఆరు బంగారు కడ్డీలు దాచబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కడ్డీలను గోధుమ రంగు టేప్ తో చుట్టి, అత్యంత వ్యూహాత్మకంగా దాచారు. స్వాధీనం చేసుకున్న బంగారం రెండు కిలోగ్రాముల బరువు కలిగి ఉండవచ్చు అని అధికారులు అంచనా వేశారు.
ఇక కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న బంగారం టారిఫ్ విలువ సుమారు రూ. 1.17 కోట్లు. కాగా ఈ సంఘటన ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితురాలిని పోలీసు కస్టడీకి తరలించారు. ఇకపోతే పోలీసులు ఈ బంగారం ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఇతర భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల అప్రమత్తత వల్ల స్మగ్లర్ల కుట్ర భగ్నమైంది.
