Let's talk: editor@tmv.in
ఢిల్లీ లక్ష్మీనగర్‌లో దారుణం: తండ్రీ–కొడుకులపై పాశవికంగా దాడి

ఢిల్లీ లక్ష్మీనగర్‌లో దారుణం: తండ్రీ–కొడుకులపై పాశవికంగా దాడి

Pinjari Chand
6 జనవరి, 2026

ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. గూండాల గుంపు ఒక తండ్రి–కొడుకుల జంటను బహిరంగంగా నగ్నంగా చేసి, దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శాంతి భద్రతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ ఘటన జనవరి 2న మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల మధ్యలో, వారి సొంత ఇంటి ముందు చోటుచేసుకుంది. కుటుంబం తమ ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో ఈ హింసాకాండ ప్రారంభమైంది.

ఇది అత్యాచారంతో సమానం కాదా?

బాధిత యువకుడి తల్లి రీతా గార్గ్ మాట్లాడుతూ ఈ ఆస్తి మా పేరుపై ఉంది. మా ఇంటి ముందు నిలబడే హక్కు మాకిలేదా? ఆ రోజు నా భర్తతో కలిసి బయట ఉన్నాను. అప్పుడు శుభమ్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి నా భర్తను పట్టుకున్నాడు. నేను అడ్డుకునే ప్రయత్నం చేయగానే పింటు యాదవ్ తన థార్ వాహనాన్ని వేగంగా తీసుకొచ్చాడు. నా భర్త తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. అతని కుమారుడు నన్ను కొట్టాడు. వికాస్ యాదవ్, పింటు యాదవ్, శుభమ్ యాదవ్ కలిసి నా భర్తపై దాడి చేశారు. నన్ను నేలపై పడేసి, కడుపులో తన్నారు, జుట్టు లాగారు. నన్ను తీవ్రంగా అవమానించారు. సహాయం కోసం నేను పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాను. అప్పటికే వారు ఇంట్లోకి చొరబడి నా కుమారుడిని లాగి బయటకు తీసుకువచ్చారు. అతని బట్టలన్నీ చింపేసి నగ్నంగా కొట్టారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. నా కుమారుడు చేతులు జోడించి వేడుకున్నాడు… ఇది అత్యాచారంతో సమానం కాదా?

మా కుమారులు ఇంటి నుంచి పారిపోయారు

బాధితుడు రాజేశ్ గార్గ్ మాట్లాడుతూ జనవరి 2న మధ్యాహ్నం నేను ఇంటి బయట ఉన్నాను. పింటు యాదవ్ సేవకుడు శుభమ్ యాదవ్ నన్ను తోసేశాడు. ఆ తర్వాత పింటు యాదవ్, శుభమ్ యాదవ్ నా బట్టలు చింపేసి ముఖంపై పిడి గుద్దులు కురిపించారు. పింటు యాదవ్ మా ఇంటి కింద ఫిట్‌నెస్ సెంటర్ నడుపుతున్నాడు. నా కుమారుడి పెళ్లి ఇంకా 10 రోజుల్లో ఉంది. అతన్ని తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై పడి ఉన్నాడని చూశాను. మా ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. భయంతో మొబైళ్లు కూడా ఆఫ్ చేసుకున్నారు. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఇప్పటివరకు పోలీసులు పింటు యాదవ్‌ను మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వారంతా పరారీలో ఉన్నారు. వారందరినీ అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలి. ఈ ఘటన తర్వాత భయంతో మానసిక వేదనతో బాధితుల ఇద్దరు కుమారులు ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయారని, వారి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

పోలీసులు పింటు యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మిగిలిన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కుల కార్యకర్తలు, నెటిజన్లు ఢిల్లీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.