
ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఊరట.. సత్యమే గెలిచింది: కవిత
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఢిల్లీ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ డిశ్చార్జ్ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వెలువడిన ఈ తీర్పుపై ఆమె స్పందిస్తూ, ఈ కేసు కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అల్లిన "అబద్ధాల అల్లిక" అని, న్యాయవ్యవస్థ ఆ కుట్రను ఛేదించిందని పేర్కొన్నారు. "సత్యమేవ జయతే.. నిజం గెలిచింది" అని ఆమె వ్యాఖ్యానించారు.
కోర్టు తీర్పు – కేసుకు ముగింపు
ఢిల్లీ కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు మరో 20 మందిని ఈ కేసు నుంచి ఊరట లభించింది. ఈ మద్యం పాలసీలో ఎటువంటి నేరపూరిత కుట్ర లేదా ఉద్దేశం ఉన్నట్లు సీబీఐ ఆధారాలను చూపలేకపోయిందని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులను కొట్టివేసింది. 2024 మార్చిలో అరెస్ట్ అయిన కవిత, సుమారు ఐదు నెలల పాటు తీహార్ జైలులో ఉండి, అదే ఏడాది ఆగస్టు 29న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
తీర్పు వెలువడిన అనంతరం కవిత హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని తాను మొదటి నుంచే చెబుతున్నానని గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షసాధింపుగా ఈ కేసును నమోదు చేశారని ఆరోపించారు. సత్యమేవ జయతే. ఇది అబద్ధాల వలయం. న్యాయవ్యవస్థ దానిని చీల్చి పారేసింది, అని ఆమె వ్యాఖ్యానించారు. కవిత తన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు, అలాగే తెలంగాణ జాగృతి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారు తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కేసు రాజకీయ కక్షసాధింపే అని పలుమార్లు చెప్పారని ఆమె గుర్తుచేశారు.
నా పిల్లలతో గడపాల్సిన ఐదు నెలల సమయం ఎవరు తిరిగి ఇస్తారు? నా కుటుంబంతో కోల్పోయిన సమయానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని కవిత భావోద్వేగంగా ప్రశ్నించారు. జైలులో గడిపిన రోజుల వల్ల తనపై ఆన్‌లైన్‌లో జరిగిన దుష్ప్రచారం, ప్రజాసభల్లో వచ్చిన విమర్శలు, వ్యక్తిగత దాడులపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కేసీఆర్, అన్నయ్యతో ఈ ఆనందాన్ని పంచుకుంటారా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ, ఈ తీర్పు తెలిసిన వెంటనే నేను మా తల్లి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇది ఇతర విషయాలు మాట్లాడే సమయం కాదు. నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు, అని చెప్పారు.
కేటీఆర్ స్పందన
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని బలిపశువును చేశారని ఆరోపించారు. కవితకు న్యాయం జరిగినట్లే, ఇతర బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులు కూడా వీగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. మీడియా ట్రయల్స్ ద్వారా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలు ఇకనైనా ఆగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజం
కవిత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఓటమికి ఢిల్లీ ఎక్సైజ్ కేసే కారణమని చెప్పడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. మీరు నిరాకరణలో జీవిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏం జరిగింది అనేది అర్థం చేసుకోండి. ప్రజల్లోకి వెళ్లి పోరాడండి. పార్టీ ఓటమికి నన్ను బాధ్యురాలిగా చూపించవద్దు, అని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ప్రధాన కారణాలు నెరవేర్చని హామీలేనని కవిత అభిప్రాయపడ్డారు. పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, అధికారంలో అహంకారం వంటి అంశాలే ప్రజల్లో అసంతృప్తికి దారితీసాయని ఆమె అన్నారు. ఒక వ్యక్తి వల్ల ఓడిపోవడానికి బీఆర్ఎస్ అంత బలహీనమైన పార్టీనా? నా వల్ల పార్టీ ఓడిపోయిందని చిత్రీకరించడం మానుకోండి అని ఆమె వ్యాఖ్యానించారు.
మూడేళ్ల పాటు మూడేళ్ల పాటు నేను కేసులతో పోరాడుతుంటే పార్టీ నాకు ఎక్కడ మద్దతు ఇచ్చింది? కనీసం పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా నాకు అండగా నిలబడలేదు. జైలుకు వెళ్ళింది పార్టీ కోసమే కదా, తెరవెనుక ఏం జరిగిందో మీకు తెలియదా? అని అన్నను నేరుగా ప్రశ్నించారు.
కొత్త పార్టీ ప్రకటన
2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశంలో తన బంధువులు, పార్టీ నాయకులు తండ్రి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. సస్పెన్షన్ తర్వాత కవిత తెలంగాణ జాగృతి పేరిట ప్రజా సమస్యలపై చురుకుగా పనిచేస్తున్నారు. గత డిసెంబర్‌లో తన రాజకీయ వేదికను ప్రారంభించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో కొత్త పార్టీ ప్రారంభిస్తానని కూడా వెల్లడించారు.
ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ముగింపు కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాకుండా, రాజకీయ ప్రభావం కూడా చూపనుంది. ఒకవైపు కోర్టు తీర్పుతో ఉపశమనం పొందిన కవిత, మరోవైపు బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. తనపై నమోదైన కేసులు తప్పుడు ఆరోపణలేనని, ప్రజల ముందు నిజం నిలుస్తుందని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. “సత్యమే గెలిచింది. ఇక ప్రజల మధ్యకు వెళ్లి నా పోరాటాన్ని కొనసాగిస్తాను,” అని ఆమె పేర్కొన్నారు.
