
ఢిల్లీ బానిసలు ఏఐఏడీఎంకే నాయకులు: స్టాలిన్
ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200కుపైగా స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం(ఏఐఏడీఎంకే)కు స్వతంత్ర ఆలోచనలేమీ లేవని, అది ఢిల్లీలోని బీజేపీ సంకేతాలకే డ్యాన్స్ చేస్తోందని విమర్శించారు. డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ‘ద్రావిడియన్ మోడల్’ పరిపాలన ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అందులో నెలకు రూ.1000 చొప్పున అందించే ‘కలైంజర్ మహిళల హక్కు భృతి పథకం’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు వంటి కార్యక్రమాలు ముఖ్యమని చెప్పారు. ప్రజలు మా పార్టీపై అపారమైన ప్రేమ, విశ్వాసం చూపుతున్నారు. వారి మద్దతుతో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ) 200కుపైగా సీట్లు గెలిచి ‘ద్రావిడియన్ మోడల్ 2.0’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీకి చెందిన మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడు హక్కులను తాకట్టు పెట్టారు
ఏఐఏడీఎంకే నాయకత్వంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి సిద్ధాంతం లేదని, ఢిల్లీలోని బీజేపీనే దాని అసలు కేంద్రంగా పనిచేస్తోందని అన్నారు. ఏఐఏడీఎంకే నాయకులను ‘బానిసలు’గా అభివర్ణించిన తన వ్యాఖ్యలపై ప్రశ్నించగా, తమిళనాడు హక్కులన్నీ తాకట్టు పెట్టిన వారిని ఇంకెలా పిలవాలి? ఢిల్లీ సంకేతాలకే నాట్యం చేసే వారిని వేరేలా ఎలా పిలవాలి? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
స్నేహపూర్వకంగా కాంగ్రెస్‌తో చర్చలు
2026 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో జరిగిన సీట్లు పంచుకునే చర్చలు కఠినంగా జరిగాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, సీట్ల కేటాయింపులో ఇలాంటి పరిస్థితులు సాధారణమేనన్నారు. చర్చలు స్నేహపూర్వకంగా ముగిశాయని, ఇప్పుడు కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి విజయం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. 2019 నుంచి తమ కూటమి బలంగా కొనసాగుతోందని, మరిన్ని పార్టీలు కూడా ఇందులో చేరి దాన్ని మరింత బలపరిచాయని ఆయన చెప్పారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ.పన్నీర్‌సెల్వం చేరికపై
మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం డీఎంకేలో చేరడంపై స్టాలిన్ మాట్లాడుతూ, ఏఐఏడీఎంకే స్థితిని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. ద్రావిడియన్ ఉద్యమ సిద్ధాంతాలపై నిబద్ధత ఉన్నవారు చివరకు డీఎంకేలో చేరుతారని, పన్నీర్‌సెల్వం కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
డీఎండీకేకు 10 సీట్లు
తమ పార్టీ బలంగా ఉన్నప్పటికీ దేశీయ మర్‌పొక్కు ద్రావిడ కజగం(డీఎండీకే)కు 10 సీట్లు కేటాయించిన విషయం గురించి ప్రశ్నించగా, మిత్రపక్షాల గౌరవాన్ని కాపాడటం తమ రాజకీయ ధోరణి అని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర హక్కుల కోసం పనిచేసే పార్టీలతో కలిసి పనిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
జాతీయ రాజకీయాలపై
దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో తాను పెద్ద పాత్ర పోషించాలా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, తన పరిమితులు తనకు తెలుసని చెప్పారు. తన తండ్రి, డీఎంకే పితామహుడు ఎం.కరుణానిధి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
పొల్లాచి కేసులో ఐపీఎస్‌ను కూడా ఏఐఏడీఎంకే నాయకులు వేధించారు
ఏఐఏడీఎంకే ప్రధాన నాయకుడు ఎడప్పాడి కే. పళనిస్వామి చేసిన ‘ముఖ్యమంత్రి కుటుంబమే అధికార కేంద్రంగా పనిచేస్తోంది’ అన్న ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. అవి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న కల్పిత కథలేనని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ, పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వ కాలంలో జరిగిన పొల్లాచి సెక్సువల్ కేసు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. ఆ కాలంలో ఒక మహిళ ఐపీఎస్ అధికారిని కూడా లైంగిక వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్కా వంటి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం ‘తోళి’ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు, ఫిర్యాదులు నమోదు చేయడానికి అవగాహన పెంచినట్లు చెప్పారు. మహిళల భద్రత విషయంలో భారతదేశంలోనే తమిళనాడు నంబర్ వన్ రాష్ట్రం అని స్టాలిన్ అన్నారు.
