
ఢిల్లీ బడ్జెట్ రూ.1.03 లక్షల కోట్లు
ఢిల్లీ అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, మొత్తం వ్యయం రూ.1,03,700 కోట్లుగా నిర్ధారించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.3,700 కోట్లు (సుమారు 3.7 శాతం) పెరుగుదల. మొత్తం బడ్జెట్‌లో రూ.62,550 కోట్లు పథకాలు, ప్రాజెక్టులకు కేటాయించగా, రూ.41,150 కోట్లు రెవెన్యూ, మూలధన వ్యయాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయ వనరుల్లో జీఎస్టీ ద్వారా రూ.43,500 కోట్లు, మొత్తం పన్ను ఆదాయం రూ.74,000 కోట్లు ఉండగా, పన్నేతర ఆదాయం రూ.900 కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రూ.3,931 కోట్లు, కేంద్ర సహాయం రూ.968 కోట్లు, సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి రూ.591 కోట్లు, స్వచ్ఛ గంగా మిషన్ కింద రూ.1,500 కోట్లు, విపత్తు నిర్వహణకు రూ.100 కోట్లు లభించనున్నాయి. అదనంగా మార్కెట్ బారోయింగ్ ద్వారా రూ.16,700 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యా, వైద్యం, పర్యావరణానికి ప్రాధాన్యం
రంగాల వారీగా విద్యకు అత్యధికంగా రూ.19,326 కోట్లు (18.64 శాతం) కేటాయించగా, ఆరోగ్యానికి రూ.13,034 కోట్లు (12.57 శాతం) కేటాయించారు. రవాణా, రహదారులకు రూ.12,613 కోట్లు, గృహ, పట్టణాభివృద్ధికి రూ.11,572 కోట్లు, సామాజిక భద్రతకు రూ.10,537 కోట్లు, నీటి సరఫరా, పారిశుధ్యానికి రూ.9,000 కోట్లు కేటాయించారు. పర్యావరణ పరిరక్షణకు బడ్జెట్‌లో 21.44 శాతం, అంటే రూ.22,236 కోట్లు కేటాయించడం ముఖ్యాంశంగా నిలిచింది. కాలుష్య నియంత్రణ, గ్రీన్ ఏరియాల విస్తరణ, వ్యర్థాల నిర్వహణ, శుభ్రమైన శక్తి వినియోగానికి ఈ నిధులు వినియోగించనున్నారు.
మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి రూ.11,266 కోట్లు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు రూ.5,921 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.7,887 కోట్లు కేటాయించారు. 750 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.1,392 కోట్లు, అనధికార కాలనీల అభివృద్ధికి రూ.800 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేల నిధులను రూ.350 కోట్లుగా నిర్ణయించారు. నీటి సరఫరా, పారిశుధ్యానికి ఢిల్లీ జల్ బోర్డుకు రూ.9,000 కోట్లు కేటాయించారు. పైప్‌లైన్ విస్తరణ, నీటి సరఫరా మెరుగుదల, మలిన జల శుద్ధి సామర్థ్యాన్ని 707 ఎంజీడీ నుంచి 814 ఎంజీడీకి పెంచే ప్రణాళికను తీసుకురానున్నారు. ఆరోగ్య రంగానికి రూ.12,645 కోట్లు కేటాయించగా, ఆసుపత్రులు, ఐసీయూ ప్రాజెక్టులకు రూ.150 కోట్లు, మందులు, పరికరాలకు రూ.787 కోట్లు, ఆయుష్మాన్ పథక విస్తరణకు రూ.202 కోట్లు కేటాయించారు. 750కు పైగా కొత్త ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యా రంగానికి రూ.19,148 కోట్లు కేటాయించగా, కొత్త పాఠశాల భవనాలకు రూ.200 కోట్లు, విస్తరణకు రూ.275 కోట్లు కేటాయించారు. బాలికలకు సైకిళ్ల కోసం రూ.90 కోట్లు, ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌ల కోసం రూ.10 కోట్లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లకు రూ.150 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.720 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమంలో మహిళలు, శిశు అభివృద్ధికి రూ.7,406 కోట్లు కేటాయించారు. మహిళా సమృద్ధి యోజనకు రూ.5,110 కోట్లు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత బస్సు ప్రయాణానికి రూ.450 కోట్లు, ఉచిత ఎల్పీజీ సిలిండర్లకు రూ.260 కోట్లు, ‘లఖ్‌పతి బేటీ యోజన’కు రూ.128 కోట్లు కేటాయించారు.
మెట్రో విస్తరణకు నిధులు
రవాణా రంగానికి రూ.8,374 కోట్లు కేటాయించగా, 6,130 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 నాటికి మొత్తం బస్సుల సంఖ్యను 7,500కు పెంచే ప్రణాళిక ఉంది. మెట్రో విస్తరణకు రూ.2,885 కోట్లు, ఈవీ పాలసీకి రూ.200 కోట్లు కేటాయించారు. పాలన మెరుగుదలకు 13 మినీ సెక్రటేరియట్‌ల ఏర్పాటు కోసం రూ.100 కోట్లు కేటాయించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్, ‘డిటి(డీఐటీఐ)’ పేరిట కొత్త థింక్ ట్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు, ఉపాధి రంగానికి రూ.48 కోట్లు కేటాయించగా, ఎంఎస్ఎంఈలకు శిక్షణ, సెమీకండక్టర్, డ్రోన్ విధానాలను ప్రవేశపెట్టే ప్రణాళిక ఉంది. పర్యాటక రంగానికి రూ.412 కోట్లు కేటాయించగా, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ, 1,000 ఆధునిక మరుగుదొడ్ల ఏర్పాటు, నగర సుందరీకరణ చర్యలు చేపట్టనున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలకు రూ.300 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలుష్య నియంత్రణకు రూ.204 కోట్లు కేటాయించారు. వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, కార్బన్ క్రెడిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నారు.
