
ఢిల్లీ పోలీసుల తీరుపై కేటీఆర్ ఆందోళన.. బీఆర్ఎస్‌పై బీజేపీ విమర్శలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. దీంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఒక తండ్రిగా ఆవేదనతోనే నిరసన: కేటీఆర్
తన 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండి, విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కేటీఆర్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల తండ్రిగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, మహిళలపై పోలీసులు జరిపిన అరాచకాలను చూసి తీవ్రంగా ఆవేదన చెందాను. దేశ యువతకు సంఘీభావం తెలపడం తప్ప దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు అని స్పష్టం చేశారు. కేవలం పేపర్ లీకేజీల పైనే కాకుండా, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ నెరవేర్చకపోవడం వల్ల కూడా దేశ యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. నేపాల్, శ్రీలంకలలో జెన్ జీ ఉద్యమాలు ప్రభుత్వాలనే కూల్చివేశాయని, మోడీ యువతతో ఆటలాడకూడదని హెచ్చరించారు.
స్లాటర్ హౌస్‌లు, మీడియా ఎజెండాలను అడ్డం పెట్టుకుని చేసే వ్యక్తిత్వ హనన రాజకీయాలు ఇక సాగవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది జెన్ జీ యువత సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని తెలిపారు. ఈడీ, సీబీఐ భయంతో మీడియా చూపించకపోయినా, విద్యార్థులే సోషల్ మీడియాతో దేశాన్ని కదిలించారు. 'బడే భాయ్స మోడీని మేము ప్రశ్నిస్తుంటే 'ఛోటా భాయ్' రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వస్తోంది? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి మోడీని ఎదిరించే దమ్ము లేని రేవంత్ రెడ్డి, పోరాడే తమ కాళ్లలో కట్టెలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చి, ఢిల్లీ మెడలు వంచిన చరిత్ర తమదని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల హక్కుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కేటీఆర్‌కు నైతిక హక్కు లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను తొలగించాలని ప్రయత్నించిందని, ఇప్పుడు అదే ప్రదేశంలో కేటీఆర్ ఆందోళన చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
పేపర్ లీకేజీల అంశంపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్, పదేళ్ల పాలనలో ఒక్క గ్రూప్-1 నియామకం కూడా చేపట్టకపోవడం, ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారంలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు నిరసనలు చేపట్టడం సమంజసం కాదన్నారు.
ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత - కాంగ్రెస్ నిరసన
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నా చౌక్‌ను ఎత్తివేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్త నిరసనలు
ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూలై 20న ఢిల్లీలో యువజన సంఘాలు, సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిపై దాఖలైన పిటిషన్‌ను జులై 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ రావడంతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను గురువారం రాత్రి విరమించారు.
