
ఢిల్లీ పోలీసుల ఆపరేషన్..పాక్ ఉగ్ర కుట్ర భగ్నం
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన కీలక కార్యకర్తను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, భారత యువతను లక్ష్యంగా చేసుకున్న ఉగ్ర మాడ్యూల్‌ను బట్టబయలు చేశారు. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి, ప్రచారం నుంచి ఉగ్రదాడుల వరకు వివిధ కార్యకలాపాలకు వారిని సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితుడు హర్మన్‌దీప్ సింగ్ అలియాస్ హర్మన్ (18), ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందినవాడని అధికారులు వెల్లడించారు. భట్టి నెట్‌వర్క్‌పై రహస్య నిఘా చేపట్టిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఈ నెట్‌వర్క్‌ను పాకిస్తాన్ నుంచి రిమోట్‌గా నిర్వహిస్తూ, భారత్‌లోని యువతను డబ్బు, గుర్తింపు, విలాసవంతమైన జీవితం వాగ్దానాలతో ఆకర్షిస్తున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ నర్రా చైతన్య తెలిపారు. నిందితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భట్టి, అతని సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు విచారణలో వెల్లడైంది. అతని మొబైల్‌లో పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో జరిగిన చాట్స్, వారి ఆదేశాల మేరకు చేసిన కార్యకలాపాల ఫోటోలు, వీడియోలు లభించాయి. కశ్మీరీ గేట్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో తన సహచరులు పాల్గొన్నారని హర్మన్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని భట్టి అనుచరుడు సోషల్ మీడియాలో బాధ్యత స్వీకరించినట్టు కూడా గుర్తించారు. పాకిస్తాన్ హ్యాండ్లర్లు ముందుగా సోషల్ మీడియా కార్యకలాపాలను విశ్లేషించి లక్ష్యంగా వ్యక్తులను ఎంపిక చేసి, దశలవారీగా నెట్‌వర్క్‌లో చేర్చుకుంటారని పోలీసులు తెలిపారు. మొదట చిన్న పనులు—డబ్బు పంపడం, లాజిస్టిక్స్ ఏర్పాటు, కీలక ప్రాంతాల రికానైసెన్స్, వీడియోలు పంపడం, గ్రాఫిటీలు వేయడం—అప్పగించి, తరువాత నమ్మకం కుదిరిన తర్వాత గ్రెనేడ్ దాడులు, కాల్పుల వంటి తీవ్రమైన కార్యకలాపాలకు ప్రోత్సహిస్తారని వివరించారు.
గ్యాంగ్‌స్టర్ల జీవనశైలికి ఆకర్షితుడై
హర్మన్‌కు అప్పగించిన పనుల్లో భాగంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా పబ్లిక్ ప్రదేశాల్లో గ్రాఫిటీలు వేయాలని సూచించినట్టు తెలిపారు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా తల్వారాలో మూడు చోట్ల గ్రాఫిటీలు వేసి, వాటి ఫోటోలు, వీడియోలను హ్యాండ్లర్లకు పంపినట్టు విచారణలో బయటపడింది. అతని వద్ద నుంచి స్ప్రే పెయింట్ బాటిల్, కీలక సమాచారం ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్మన్ చిన్న వయసులోనే చదువు మానేసి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి, గ్యాంగ్‌స్టర్ల జీవనశైలికి ఆకర్షితుడై ఈ నెట్‌వర్క్‌లో చేరినట్టు విచారణలో తెలిపాడు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తే భారీగా డబ్బు, విదేశాలకు ప్రత్యేకంగా దుబాయ్‌కు పంపిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. అదేవిధంగా, తన స్నేహితులను కూడా ఈ నెట్‌వర్క్‌లో చేర్చేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. రాంపూర్‌లోని పోలీస్ చౌకీపై గ్రెనేడ్ దాడి చేయాలనే ప్రణాళికలపై కూడా చర్చలు జరిగినట్టు వెల్లడించారు. పంజాబ్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు సరఫరా చేస్తామని హ్యాండ్లర్లు చెప్పినట్టు సమాచారం. సమయానికి నిందితుడిని అరెస్ట్ చేయడం వల్ల ఈ ఉగ్ర మాడ్యూల్ ప్రణాళికలు విఫలమయ్యాయని, మరింత మంది సభ్యులను గుర్తించి అరెస్ట్ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
