
ఢిల్లీ పోలీసులపై సుప్రీం కోర్టు అసహనం
ఢిల్లీ అల్లర్ల కేసులో శర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ బెయిల్ పిటిషన్లపై ప్రతివాద అఫిడవిట్ దాఖలు చేయనందుకు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన యూఏపీఏ కేసులో నిందితులైన శర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్, గల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్ ల బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ పోలీసులు తమ కౌంటర్ ను (అఫిడవిట్) దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియా బెంచ్ ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇంకా గడువును పొడగించమని స్పష్టం చేసింది.
మేం క్రితంసారి స్పష్టంగా చెప్పాం. చివరిసారి మేం నోటీసు జారీ చేయమని చెప్పాం. అక్టోబర్ 27న ఈ విషయాన్ని విచారించి, దానిని పరిష్కరిస్తామని అప్పుడే కోర్టులో చెప్పాం. ఈ రోజు విచారణ జరుగుతుందని కోర్టు ప్రకటించింది. ఇప్పుడు మీరు కొత్తగా వాదనకు వస్తున్నారని చెప్పి సమయం కోరడం సరికాదు అని న్యాయమూర్తులు అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజుకు తెలిపారు.
ఉమర్ ఖాలిద్ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదిస్తూ వీరు ఐదేళ్లకు పైగా జైలులో ఉన్నారు. ఇంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.దీనిపై జస్టిస్ అరవింద్ కుమార్ ఆలస్యం కారణంగా సహానుభూతి ఆధారంగా బెయిల్ ఇవ్వవచ్చేమో అని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ హైకోర్టు గత సెప్టెంబర్ 2న ఇమామ్, ఖాలిద్‌తో పాటు ఏడుగురికి బెయిల్ నిరాకరించింది.
హైకోర్టు తీర్పులో వీరి పాత్ర తీవ్రమైనది. మతపరమైన విభజనను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇది యాదృచ్చికంగా జరిగిన అల్లర్లు కావు. ముందే ప్రణాళికా ప్రకారం జరిగిన కుట్ర అని పేర్కొంది.
ఈ కేసు 2020లో సీఏఏ–ఎన్‌ఆర్సీ వ్యతిరేక నిరసనల సమయంలో నెలకొన్న అల్లర్లకు సంబంధించినది. ఆ అల్లర్లలో 53 మంది మృతి చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. శర్జీల్ ఇమామ్‌ను ఢిల్లీ పోలీసులు ప్రధాన కుట్రదారుడిగా గుర్తించి యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు.
