
ఢిల్లీ పేలుడు: 5 రోజుల తర్వాత తెరుచుకున్న ఎర్రకోట మెట్రో స్టేషన్
ఎర్రకోట సమీపంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం (నవంబర్ 10) జరిగిన ఉగ్ర పేలుడు కారణంగా 12 మంది మరణించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మూసివేసిన ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను ఐదు రోజుల తర్వాత సాధారణ ప్రయాణికుల కోసం తిరిగి తెరిచారు. ఈ స్టేషన్ ఢిల్లీ మెట్రో వైలెట్ లైన్‌లో ఉంది.
పేలుడు జరిగిన వెంటనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) భద్రతా కారణాల దృష్ట్యా ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. "తదుపరి నోటీసు వచ్చే వరకు భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేయబడి ఉంటుంది. అయితే ఇతర మెట్రో స్టేషన్లు, లైన్లు యధావిధిగా పనిచేస్తాయి" అని డీఎంఆర్‌సీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
అయితే శనివారం రోజు డీఎంఆర్‌సీ ఎర్రకోట మెట్రో స్టేషన్‌లోని రెండు గేట్లు (గేట్ నంబర్ 2, 3) పాక్షికంగా తెరిచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆదివారం గేట్ నంబర్ 1, 4తో సహా అన్ని గేట్లను తెరవడంతో ఎర్రకోట మెట్రో స్టేషన్ పూర్తి స్థాయిలో పునఃప్రారంభమైంది.
ఢిల్లీ మెట్రోలోని వైలెట్ లైన్‌లో ఉన్న ఎర్రకోట స్టేషన్, చారిత్రక రెడ్ ఫోర్ట్, జామా మసీదు, రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతాలతో సహా అనేక ప్రముఖ ప్రాంతాలకు కీలకమైన ప్రవేశ కేంద్రంగా ఉంది. ఈ తాత్కాలిక మూసివేత పాత ఢిల్లీని సందర్శించే పర్యాటకులు, ముఖ్యంగా రద్దీ సమయాల్లో, వారాంతాల్లో ప్రయాణించే వారిపై తీవ్ర ప్రభావం చూపింది.
దర్యాప్తు కొనసాగింపు
నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన ఉగ్ర పేలుడులో 12 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ పేలుడు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన కీలకమైన డీఎన్ఏ, పేలుడు పదార్థాలు, ఇతర నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేంద్రం అప్పగించింది. ఈ పేలుడు నేపథ్యంలో రెడ్ ఫోర్ట్ చుట్టూ భద్రతను పెంచారు. అధికారులు ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాలపై కఠిన నిఘా ఉంచారు.
మరోవైపు, ఈ పేలుడుతో సంబంధాలున్నాయనే అనుమానంతో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నలుగురు వైద్యులు-డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ రిజిస్ట్రేషన్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం రద్దు చేసింది.
