Let's talk: editor@tmv.in
ఢిల్లీ పేలుడు: భారత్‌లోని తమ పౌరులకు యూకే అడ్వైజరీ జారీ

ఢిల్లీ పేలుడు: భారత్‌లోని తమ పౌరులకు యూకే అడ్వైజరీ జారీ

Shaik Mohammad Shaffee
12 నవంబర్, 2025

ఢిల్లీలో సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటన అనంతరం భారతదేశానికి ప్రయాణించే బ్రిటిష్ పౌరుల కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ది ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీఓ) తమ పౌరులను స్థానిక అధికారుల సూచనలు పాటించాలంటూ పేర్కొంది.

“ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది. మీరు ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే, స్థానిక అధికారుల సూచనలను పాటించండి. స్థానిక మీడియా ద్వారా సమాచారం తెలుసుకోండి” అని ఎఫ్‌సీడీఓ తెలిపింది. ఈ సూచన ప్రభుత్వం విధించే ఆంక్ష కాదు, కానీ ప్రయాణికులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేలా మార్గదర్శకంగా జారీ చేసినదే. సూచనలను నిర్లక్ష్యం చేస్తే ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్షూరెన్స్) రద్దు అయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది.

భారతదేశానికి సంబంధించిన ఇతర హెచ్చరికలను మాత్రం ఎఫ్‌సీడీఓ మార్చలేదు. భారత్‍-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించవద్దని, అయితే వాఘా సరిహద్దు ద్వారా ప్రయాణం మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. కశ్మీర్, మణిపూర్ ప్రాంతాలపై కూడా బ్రిటీష్ పౌరులకు పాత ప్రయాణ హెచ్చరికలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

సోమవారం సాయంత్రం 6.52 గంటలకు (స్థానిక సమయం) ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొలుత తొమ్మిది మంది మరణించగా, మంగళవారం మరో ముగ్గురు గాయాలతో మరణించడంతో మృతుల సంఖ్య 12 కు చేరింది. 20 మంది గాయపడ్డారు.

ఫోరెన్సిక్ సాక్ష్యాలు, ఇంటెలిజెన్స్ సమాచారం బట్టి ఇది ఉగ్రవాద సంబంధాలు కలిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున, ఢిల్లీ నగరం ప్రస్తుతం హై అలర్ట్‌లో ఉంది. పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఢిల్లీ పేలుడు: భారత్‌లోని తమ పౌరులకు యూకే అడ్వైజరీ జారీ - Tholi Paluku