
ఢిల్లీ పర్యటనలో పవన్: అమిత షా ,అశ్విని వైష్ణవ్‌లతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ,పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర భద్రత ,శాంతిభద్రతల అంశాలతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై ఆయన విన్నవించారు.
ఈ చర్చల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు ప్రతిపాదించిన ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టు గురించి పవన్ కల్యాణ్ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనను ఎన్‌డిఎమ్ఏ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ఉంచేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదలకు సహకరించాలని కోరారు. తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
పిఠాపురం రైల్వే స్టేషన్‌కు 'మోడల్ స్టేషన్' హోదా
ఈ పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఐటీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన కొత్త ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో వివరించారు. అలాగే పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. పిఠాపురంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గురించి చర్చించారు . కాకినాడ, పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలోని సామర్లకోట - ఉప్పాడ రహదారిలో రోడ్డు ఓవర్ బ్రిడ్డి నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ కారణంగా వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచి అధికారంలోకి వస్తే ఆర్వోబీ నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం పాలనాపరమైన అనుమతి ఇవ్వటంతో పాటుగా రూ. 59.70 కోట్లు మంజూరు చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టును సేతు బంధన్ పథకం కింద కాకుండా గతిశక్తి పథకం కిందకు చేర్చాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. దీనికి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
ఈ ఢిల్లీ పర్యటన కేవలం వినతులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగింది. వివిధ కేంద్ర మంత్రులతో జరిగిన వరుస భేటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ అనేక పరిపాలనాపరమైన,,అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
