
ఢిల్లీ నుంచి పార్లమెంట్ సమావేశాలను తరలించండి: బీజేడీ
ఢిల్లీలో ప్రతి సంవత్సరం తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని మనుషులు సృష్టించిన విపత్తు గా వర్ణిస్తూ, గాలి నాణ్యత మెరుగుపడే వరకు పార్లమెంట్ శీతాకాల, బడ్జెట్ సమావేశాలను రాజధాని వెలుపలకు మార్చాలని బిజెడి రాజ్యసభ సభ్యుడు మనస్ రంజన్ మంగరాజ్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే విషయంలో ఒడిశా రాష్ట్రం చూపే ముందు చూపుని ఢిల్లీ కాలుష్యంపై కేంద్రం చూపాల్సిన అవసరాన్ని సూచించారు. తుఫానులు, వరదలు వస్తే క్రమశిక్షణతో ఎలా ఎదుర్కోవాలో ఒడిశా నుండి వచ్చిన నాకు తెలుసు. సంక్షోభం అంటే ఏమిటో నాకు తెలుసు.కానీ నన్ను ఢిల్లీ కాలుష్యం కలవరపెడుతున్నదని అన్నారు.
సభ్యులు, పార్లమెంటరీ సిబ్బంది, డ్రైవర్లు, శుభ్రత , భద్రతా సిబ్బంది ప్రతిరోజూ విషపూరితమైన గాలిని పీలుస్తూ అనారోగ్యానికి గురవుతున్నారని , దీనిని సాధారణమైందిగా చూడటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమైన సమావేశాలను కాలుష్యం అధికంగా ఉండే నెలల్లో నిర్వహించడం ప్రాణపాయ పరిస్థితిని సృష్టిస్తోంది అని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన శుభ్రమైన గాలి, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్న పలు నగరాలను ప్రత్యామ్నాయంగా సూచించారు. అందులో భువనేశ్వర్, హైదరాబాద్, గాంధీనగర్, బెంగళూరు, డెహ్రాడూన్, గోవాల పేర్లు చెప్పారు.
రాజకీయంగా మాట్లడటం లేదు
ఒడిశా తుఫాను సమయంలో తీరప్రాంతాల నుంచి గంటల్లో లక్షలాది మందిని ఖాళీ చేయించి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడగలగితే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు, సిబ్బంది ఆరోగ్యం కోసం రెండు సమావేశాలను సురక్షిత నగరాలకు మార్చలేకపోవడం దారుణమని అన్నారు. నేను రాజకీయాల గురించి మాట్లడటం లేదు. ప్రాణం, గౌరవం గురించి చెబుతున్నాను. పార్లమెంట్ ఈ విషయంలో ఆలోచించాలి, ముందడుగు వేయాలి. అన్ని కంటే ముందు జీవించే హక్కు అందరికి ఉంది. దానికంటే వేరే ఏది లేదని మంగరాజ్ స్పష్టం చేశారు.శీతాకాలంలో గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న నగరాల్లో పార్లమెంట్ సమావేశాలను రోటేషన్ పద్ధతిలో నిర్వహించే అవకాశంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి సంవత్సరమూ ఢిల్లీలొ అక్టోబర్ నుంచి జనవరి వరకు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి వెళుతుంది. అందుకు పంట వ్యర్థాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణపు ధూళి, కాలుష్యాన్ని కట్టేసే శీతాకాల వాతావరణ పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. ఈ కాలం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సెషన్‌తో సమాంతరంగా వస్తోంది. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
లోక్‌సభలో కాలుష్య సంక్షోభంపై కాంగ్రెస్ ఆందోళన
లోక్‌సభలో ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిపై తక్షణ దృష్టి సారించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ విషపు గాలిని పీలుస్తోంది. ప్రజలు శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందన ఏమిటి? కఠిన చర్యలు తీసుకోవడం లేదు. స్పష్టమైన ప్రణాళిక లేదు, బాధ్యత వహించే వారు కూడా లేరు. కేవలం దిష్టిబొమ్మలుగా మాత్రమే వ్యవహరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
