
ఢిల్లీ గాలి కాలుష్యం ‘స్లో పాయిజన్ ’లా ఉంది: కాంగ్రెస్ ధ్వజం
ఢిల్లీలో వాయు కాలుష్యం ‘స్లో పాయిజన్’ (నెమ్మదిగా చంపే విషం)లా మారిందని, ఇది సాధారణ వ్యక్తి ఆయుష్షును 6 నుంచి 7 ఏళ్లు తగ్గిస్తోందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. ఈ ‘జాతీయ సమస్య’పై అన్ని పార్టీల ఎంపీలతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని లేదా కనీసం పార్లమెంటులో వివరణాత్మక చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ బీజేపీ-ఆప్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణం
దీపావళి పటాకులు, పంట కాల్చివేతలు కొంత కాలుష్యం కలిగిస్తాయి. కానీ అవి ప్రధాన కారణం కావు. వాహనాల వల్లే సుమారు 35శాతం కాలుష్యం ఉంటుందని అన్నారు. బిజెపి–ఆప్ పరస్పర ఆరోపణల్లో మునిగిపోయి, సాధారణ ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కుప్పకూలింది
ఢిల్లీ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు ట్రాఫిక్ వేగం 35–40 కిమీ/గం ఉండేదని, ఇప్పుడు రోడ్డు మౌలిక సదుపాయాల లోపంతో వేగం తగ్గిపోయి వాహనాల కాలుష్య స్థాయి రెండున్నర రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. బస్సుల్లో ప్రయాణం తగ్గింది, వాహనాల సంఖ్య పెరిగింది. కొత్త మెట్రో మార్గాలు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అక్రమ కర్మాగారాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయని, ఇవి ఢిల్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్–పోలీసులు–రాజకీయ నాయకుల సహకారం లేకుండా పనిచేయలేవని ఆరోపించారు.
మరో ముప్పుగా చెత్త తగలబెట్టడం
పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి, వాటిని తగలబెట్టడం వలన కూడా కాలుష్యం పెరుగుతోందని తెలిపారు. ఇంతకుముందు వ్యర్థాల వేర్వేరు నిర్వహణ పద్ధతులు ఉండేవని కానీ ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయని అన్నారు. ‘వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్’ సాంకేతికతను క్యాన్సర్‌కు కారణమవుతుందని తప్పుడు ప్రచారం చేసి నిలిపేశారని మాజీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. ఉచితాలకు డబ్బంతా ఖర్చు చేస్తే మౌలిక సదుపాయాలకు డబ్బు ఎక్కడ ఉంటుంది?” అని ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో చర్చ అవసరం
రాహుల్ గాంధీ కూడా పార్లమెంటులో ఈ అంశంపై వివరణాత్మక చర్చ కోరారని దీక్షిత్ తెలిపారు. ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకుని జన ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలైన రోడ్లు, బస్సులు, మెట్రోపై పెట్టుబడి పెట్టాలి, లేకుంటే ప్రజలకు నష్టం తప్పదని కాంగ్రెస్ హెచ్చరించింది. ఈ కాలుష్యంతో ఢిల్లీ ఇక నివాసయోగ్యం కాదని సందీప్ దీక్షిత్ హెచ్చరించారు.
