Let's talk: editor@tmv.in
ఢిల్లీ కాలుష్యం పై ఆందోళనలు

ఢిల్లీ కాలుష్యం పై ఆందోళనలు

Pinjari Chand
10 నవంబర్, 2025

దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరితే బీజేపీ ప్రభుత్వం డేటాలో మార్పు చేసి మోసం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆదివారం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏక్యూఐ మీటర్లపై నీళ్లు చల్లించి రీడింగ్స్‌ను తగ్గిస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది అని విమర్శించారు. ఆమె ఇండియా గేట్ వద్ద జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. గాలి, నీరు అందరి ప్రాణాలకు సంబంధించినవి. బీజేపీ తన నిజాయితీ, విశ్వసనీయత క్రమంగా కోల్పోతోంది. బీజేపీ నేతలు వారి ఇళ్లలో ఎయిర్‌ ప్యూరిఫయర్లతో కూర్చుంటున్నారు. కానీ ప్రజలు కాలుష్యకారక గాలిని పీలుస్తున్నారని ఆమె వాపోయారు.

ఆప్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 365 రోజులు కాలుష్య నియంత్రణపైనే కృషి చేసేది. కానీ ఇప్పుడు బీజేపీ బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. వాస్తవ పరిస్థితులు అంగీకరించకుండా, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగా సీరియస్‌గా ఉంటే, ఇప్పటికీ ప్రజల ముందుకు వచ్చి కాలుష్య నియంత్రణ చర్యలను వివరించేవారు అని అన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ప్రదర్శనకారులను హెచ్చరించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇండియా గేట్‌ ప్రదర్శన స్థలం కాదని, వారు జంతర్‌ మంతర్‌ వైపు వెళ్లాలని సూచించారు. న్యూఢిల్లీ జిల్లా డీసీపీ దేవేశ్‌కుమార్‌ మహ్లా మాట్లాడుతూ ఇండియా గేట్‌ ఒక జాతీయ స్మారక చిహ్నం. కుటుంబాలతో ప్రజలు విహరించే ప్రదేశం. ఇక్కడ వీఐపీ మార్గాలు ఉన్నందున తరచుగా భద్రతా బలగాలు ఉంటాయి అన్నారు.

ఒక ప్రదర్శనకారుడు మాట్లాడుతూ ఏక్యూఐ రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పాలసీలు రూపొందించడం లేదు. నీళ్లు చల్లి డేటా దాచేస్తోంది. మేఘమథనం (క్లౌడ్‌ సీడింగ్‌) కూడా ఫలించలేదు. అది శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలు కూడా మేలుకోవాలి. కొందరు ఇక్కడ షో చూసేందుకు మాత్రమే వస్తున్నారు కానీ స్వరం వినిపించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఢిల్లీ వాయు నాణ్యత ‘తీవ్ర’ స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొత్తం ఏక్యూఐ 391గా నమోదైంది. ఇది ఆనంద్ విహార్‌ లో 412గా, అలీపూర్‌ 415, బావానా 436 (అత్యధికం), చాంద్నీ చౌక్‌ 409, ఆర్‌కే పురం 422, పట్పర్గంజ్‌ 425, సోనియా విహార్‌ 415,

ఇవి అన్నీ చాలా ‘సీవియర్‌’ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. దీపావళి తర్వాత నుంచి ఢిల్లీలో గాలి నాణ్యత ‘పూర్‌’, ‘వెరీ పూర్‌’ కేటగిరీల్లోనే కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ దశ 2 అమలులో ఉంది. ఇక న్యూ ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌ ఫీజులను రెండింతలు చేసింది.