
ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చకు రాహుల్ గాంధీ డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా ఉన్న వాయు కాలుష్యం సమస్యపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళం విప్పారు. ఈ సమస్యను ఒక "ఆరోగ్య అత్యవసర పరిస్థితి"గా అభివర్ణించిన రాహుల్, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడంపై తీవ్రంగా ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో వివరంగా చర్చ జరపాలని, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన, అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ తన 'ఎక్స్' పోస్ట్‌లో "నేను కలిసిన ప్రతి తల్లి చెప్పేది ఒకటే మాట.. తమ బిడ్డ విషపూరితమైన గాలిని పీలుస్తూ పెరుగుతోంది అని. వాళ్లు అలసిపోయి, భయపడి, కోపంగా ఉన్నారు" అని పేర్కొన్నారు. ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ, "మోడీ జీ, మన దేశ పిల్లలు మన కళ్ల ముందే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరు ఎలా మౌనంగా ఉండగలరు? మీ ప్రభుత్వం ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎందుకు తక్షణ చర్యలు, ప్రణాళిక, జవాబుదారీతనం చూపించడం లేదు?" అని నిలదీశారు. ఈ సమస్యపై తక్షణమే పార్లమెంట్‌లో చర్చించి, కఠినమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయంలో కేంద్రాన్ని విమర్శించారు. ఉత్తర భారతదేశంలో కాలుష్యానికి పరిష్కారం చూపకపోగా, ప్రజలు తమ కుటుంబాలను రక్షించుకోవడానికి కొనుగోలు చేసే ఎయిర్ ప్యూరిఫైర్లపై 18 శాతం జీఎస్టీ విధించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. "పరిశుభ్రమైన గాలి, నీరు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. పరిష్కారం చూపకపోతే కనీసం ప్యూరిఫైర్లపై వేసిన జీఎస్టీని వెంటనే తొలగించండి" అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ‘చాలా దారుణం’గా గాలి నాణ్యత
ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) శుక్రవారం ఉదయం 8 గంటలకు 384గా నమోదైంది. గురువారంతో పోలిస్తే కాస్త పెరిగినా, గాలి నాణ్యత మాత్రం 'చాలా దారుణం (వెరీ పూర్)' అనే కేటగిరీలోనే కొనసాగుతోంది. అశోక్ నగర్ (417), బవానా (413), జహంగీర్‌పురి (420) వంటి అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 'తీవ్రమైన' స్థాయిని దాటింది. వచ్చే వారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత 'చాలా దారుణంగా' ఉండే అవకాశం ఉందని 'ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్' అంచనా వేసింది.
సుప్రీంకోర్టు విచారణ
ఈ కాలుష్యం సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న కాలుష్య సమస్యపై వచ్చే సోమవారం నుంచి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీ శీతాకాల సమావేశాల కోసం తమ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య నిపుణుల ఆందోళన
ఈ చలికాలంలో ఢిల్లీ గాలి నాణ్యత 'చాలా దారుణమైన', 'తీవ్రమైన' స్థాయిలకు పడిపోతున్నందున, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొగతాగేవారు, ఆస్తమా రోగులు, చిన్నపిల్లలు, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడానికి రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విషపూరితమైన గాలి ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తుందని, ఉన్న రోగాలను మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరించారు.
