Let's talk: editor@tmv.in
ఢిల్లీ కారు పేలుడు కేసు: వెలుగులోకి సంచలన విషయాలు

ఢిల్లీ కారు పేలుడు కేసు: వెలుగులోకి సంచలన విషయాలు

Shaik Mohammad Shaffee
17 నవంబర్, 2025

ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తులో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక పురోగతి సాధించాయి. ఈ కుట్ర వెనుక ఉన్న డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్, షాహీన్‌లకు సంబంధించిన రూ.20 లక్షల నిధుల మార్గాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఈ మొత్తం హవాలా నెట్‌వర్క్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్ హ్యాండ్లర్ నుండి మళ్లించబడిందని ఆదివారం ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

రూ.20 లక్షల నిధులలో దాదాపు రూ.3 లక్షలు పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఎరువును కొనుగోలు చేయడానికి ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌పీకే అనేది వ్యవసాయంలో ఉపయోగించే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఆధారిత రసాయన సమ్మేళనం. దీనిని పేలుడు పదార్థాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. కాగా ఈ నిధుల నిర్వహణ విషయంలో డాక్టర్ ఉమర్-ఉన్-నబీ, డాక్టర్ షాహీన్ మధ్య విభేదాలు తలెత్తినట్లు నివేదించబడింది. దర్యాప్తు సంస్థలు కుట్ర వెనుక ఆర్థిక సంబంధాలను తెలుసుకోవడానికి డాక్టర్ ముజమ్మిల్ నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

9ఎంఎం క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు జరిగిన ప్రదేశంలో మూడు 9 ఎంఎం స్పెషల్​ బుల్లెట్లు లభించాయి. వీటిలో రెండు లైవ్​ కాట్రిడ్జ్​‌లు, ఒకటి ఖాలీ షెల్​. అ బుల్లెట్లను భద్రతాదళాలు, ప్రత్యేక అధికారులు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి తుపాకీ లభించలేదు. క్యాట్రిడ్జ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇవి ఆ ప్రాంతానికి ఎలా వచ్చాయి? అనుమానితుడు వాటిని కలిగి ఉన్నాడా? లేదా ఏదైనా ఉగ్రవాద/నేర నెట్‌వర్క్‌తో లింక్ ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏజెన్సీలు సీసీటీవీ ఫుటేజీలను, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నాయి.

నిందితులపై చర్యలు

ఢిల్లీ కారు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు శనివారం క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కుట్రకు పాల్పడినట్లుగా డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించబడిన వ్యక్తి డాక్టర్ ఉమర్-ఉన్-నబీ. ఈ కేసుతో సంబంధం ఉన్న డాక్టర్లు అదీల్ అహ్మద్ రథర్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ సయీద్‌లను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిపై గత ఉగ్రవాద కేసుల్లోనూ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ఈ నలుగురు డాక్టర్ల (డాక్టర్ ముజాఫర్ అహ్మద్‌తో కలిపి) రిజిస్ట్రేషన్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ తక్షణమే రద్దు చేసింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర వైద్య మండళ్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఎనిమిది మంది అనుమానితులు నాలుగు వేర్వేరు నగరాల్లో ఏకకాల దాడులు నిర్వహించడానికి సిద్ధమయ్యారని, బహుళ ఐఈడీలను తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తును ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.