
ఢిల్లీ ఓపెన్‌లో సురేష్ కుమార్ సంచలనం.. ఐదో సీడ్‌పై అద్భుత విజయం
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన ఏటీపీ ఢిల్లీ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో భారత ఆటగాడు మనీష్ సురేష్ కుమార్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫైయింగ్ తొలి రౌండ్‌లో 26 ఏళ్ల సురేష్ కుమార్ 4-6, 6-2, 6-3తో ఇటలీకి చెందిన ఐదో సీడ్ లొరెంజో కార్బోనిని మట్టికరిపించాడు. ఒకానొక దశలో తొలి సెట్ కోల్పోయి వెనుకబడినప్పటికీ, పట్టుదల వీడకుండా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి మ్యాచ్‌ను తన సొంతం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సురేష్ కుమార్ తన పదునైన సర్వీసులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు.
అంచనాలు లేకుండానే బరిలోకి..
విజయం అనంతరం సురేష్ కుమార్ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో నాకు చివరి నిమిషంలో ఎంట్రీ దొరికింది. దాంతో ఆడుతానో లేదో అన్న సందేహం వల్ల పెద్దగా సన్నాహాలు లేకుండానే బరిలోకి దిగాను. ప్రత్యర్థి యువ ఆటగాడు, మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలుసు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా నా సహజ సిద్ధమైన ఆటను ఆడటానికే ప్రయత్నించాను. నా ప్రణాళికలు సరిగ్గా అమలు కావడం సంతోషంగా ఉంది" అని తెలిపాడు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన భారత వెటరన్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ కూడా వరుస సెట్లలో 6-1, 6-3తో సుంగ్-హావో హువాంగ్ (చైనీస్ తైపీ)పై ఘనవిజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
పోటీలో నిలిచిన ఇతర ఆటగాళ్లు
క్వాలిఫైయింగ్ రౌండ్లలో మిగిలిన మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా సాగాయి. టాప్ సీడ్ డెనిస్ యెవ్సేవ్ (కజకిస్థాన్) కష్టమ్మీద 6-4, 6-7(3), 6-4తో మిట్సుకి వెయ్ కాంగ్ (మలేషియా)పై విజయం సాధించాడు. పది సీడ్ ఎరిక్ వాన్షెల్‌బోయిమ్ భారత్‌కు చెందిన సిద్ధార్థ్ రావత్‌ను 5-7, 6-2, 6-2తో ఓడించగా, కొరియా ఆటగాడు హ్యోన్ చుంగ్ 6-2, 6-1తో నితిన్ కుమార్ సిన్హాపై గెలిచాడు. అయితే ఎస్.డి. ప్రజ్వల్ దేవ్, ముకుంద్ శశికుమార్ వంటి భారత ఆటగాళ్లకు తొలి రోజు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగే తుది క్వాలిఫైయింగ్ రౌండ్ తర్వాత మెయిన్ డ్రాలో నిలిచే ఆరుగురు ఆటగాళ్లెవరో తేలనుంది.
విజేతలకు భారీ నగదు బహుమతులు
ఏటీపీ ఛాలెంజర్ 75 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు 17,000 డాలర్లు (సుమారు రూ. 15.39 లక్షలు), 75 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. రన్నరప్‌కు 9,600 డాలర్లు (సుమారు 8.69 లక్షలు), 44 పాయింట్లు దక్కనున్నాయి. డబుల్స్ విజేతలకు 4,980 డాలర్లు (4.50 లక్షలు) లభించనున్నాయి. హోమ్ గ్రౌండ్‌లో సుమిత్ నాగల్ వంటి టాప్ ప్లేయర్లు బరిలో ఉండటంతో ఈసారి ఢిల్లీ ఓపెన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
