Let's talk: editor@tmv.in
ఢిల్లీ ఎయిర్ నిరసనల్లో మావోయిస్టు నినాదాలు చేసినందుకు కొత్త సెక్షన్ చేర్పు

ఢిల్లీ ఎయిర్ నిరసనల్లో మావోయిస్టు నినాదాలు చేసినందుకు కొత్త సెక్షన్ చేర్పు

Pinjari Chand
26 నవంబర్, 2025

ఇండియాగేట్‌ వద్ద ఆదివారం జరిగిన ‘క్లీన్‌ ఎయిర్‌’ నిరసన సమయంలో మావోయిస్ట్‌ భావజాలాన్ని పొగుడుతూ నినాదాలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో డిల్లీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జాతీయ ఏకతపై ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్‌ 197ను కర్తవ్యపథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

పోలీసులు తెలిపిన ప్రకారం అరెస్టయిన గ్రూపు ‘హిడ్మా అమర్‌ రహే’, ‘హర్‌ గర్‌ సె హిడ్మా నికలేగా’ వంటి నినాదాలు చేసినట్టు కోర్టులో తెలిపారు. మావోయిస్ట్‌ అగ్రనేత మడవి హిడ్మా ఇటీవల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన నేపథ్యంలో ఈ నినాదాలు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని అధికారులు భావిస్తున్నారు. ఇండియా గేట్‌ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థి సంఘాలు, వాలంటరీ గ్రూపులకు చెందిన వారిలో ఆరుగురిపై కర్తవ్యపథ్‌ స్టేషన్‌లో, 17 మందిపై సంసద్‌ మార్గ్‌ స్టేషన్‌లో వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సోమవారం కోర్టుకు హాజరుపర్చిన 22 మందిని జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు.

పోలీసు నివేదిక ప్రకారం ‘ఢిల్లీ కోఆర్డినేషన్‌ కమిటీ ఫర్‌ క్లీన్‌ ఎయిర్‌’ పిలుపుపై ఇండియా గేట్‌ వద్ద భారీ సమూహం చేరే అవకాశం ఉందని ముందస్తు సమాచారం అందింది. ఏఐఎస్ఏ, జేఎన్యూఎస్యూ వంటి విద్యార్థి సంఘాలు కూడా చేరతాయని ఆదేశాలు వచ్చాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి పలువురు నిరసన కారులు బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఉన్నారు. ఇండియా గేట్‌లో నిరసనలకు అనుమతి లేదని, జంతర్‌ మంతర్‌ దగ్గర కేటాయించిన ప్రదేశంలో నిరసన చేయాలని పలుమార్లు చెప్పినప్పటికీ వారు వినలేదని అధికారులు తెలిపారు.

కొంతమంది బారికేడ్లు దాటి సీ-హెక్సగాన్‌లోకి దూసుకెళ్లి గంటకు పైగా ట్రాఫిక్‌ను నిలిపివేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో ఓ విద్యార్థి కానిస్టేబుల్‌పై దాడి చేయడమే కాకుండా కొందరు పెప్పర్‌ స్ప్రే ప్రయోగించినట్టు ఆరోపించారు. గాయపడిన పలువురు పోలీసు సిబ్బందిని ఆర్‌.ఎం‌.ఎల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అదే రాత్రి పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు మరోసారి ఉద్రిక్తత నెలకొన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

బీఎన్ఎస్ సెక్షన్‌ 197 ఏం చెబుతుంది

దేశం విడగొట్టేలా, విభజనకు ప్రోత్సహించేలా, ఉగ్ర/విద్రోహ భావజాలాన్ని పెంపొందించేలా తప్పుడు ప్రకటనలు, నినాదాలు, ప్రచారం చేస్తే ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. ఒకవేళ ఆధారాలు రుజువు చేస్తే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష. జరిమానా విధిస్తారు. లేకుంటే రెండూ విధించే అవకాశం ఉంది.

ఢిల్లీ ఎయిర్ నిరసనల్లో మావోయిస్టు నినాదాలు చేసినందుకు కొత్త సెక్షన్ చేర్పు - Tholi Paluku