
ఢిల్లీ అసెంబ్లీ ‘బొకే’ ఘటనలో వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టి లోపలికి వెళ్లి స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకే ఉంచిన ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన టాటా సియర్రా కారుతో వచ్చిన వ్యక్తి అసెంబ్లీ గేట్ నం.2 వద్ద ఉన్న ఇనుప గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం స్పీకర్ కార్యాలయం బయట పూల బొకే ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్‌గోల్చాతో పాటు ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది.
ఈ ఘటనపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా దీనిని తీవ్రమైన భద్రతా లోపంగా పేర్కొన్నారు. అధిక భద్రత ఉన్న అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక వాహనం ఇలా చొరబడటం ఆందోళనకరమని అన్నారు. ఒకవైపు ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేటు వద్దే ఆపుతుంటే, మరోవైపు ఒక వాహనం నేరుగా లోపలికి వెళ్లడం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపులు, ముఖ్యమంత్రిపై దాడి వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ కేంద్ర హోంశాఖ ఆధీనంలో పనిచేస్తున్నందున ఈ ఘటనకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వాహనం వేగంగా లోపలికి రావడంతో అడ్డుకోలేకపోయారు. అయితే బొకేలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని అధికారులు తెలిపారు.
