
ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టుకు ఉమర్ ఖలీద్
2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో తనకు బెయిల్ నిరాకరించిన తీర్పును మళ్లీ విచారించాలని విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో విచారించాలని కూడా ఆయన కోరారు. ఖలీద్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ ఈ విషయాన్ని న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు. న్యాయమూర్తులు అరవింద్‌కుమార్,ఎన్‌వీ.అంజరియాల బెంచ్ ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. పత్రాలను పరిశీలించిన తరువాత అవసరమైతే ఓపెన్ కోర్టులో విచారణకు తీసుకుంటామని బెంచ్ తెలిపింది. సుప్రీంకోర్టు నియమాల ప్రకారం, తీర్పులో స్పష్టమైన పొరపాటు, తీవ్రమైన అన్యాయం జరిగినట్లు భావించినప్పుడు పునర్విచారణ పిటిషన్లు సాధారణంగా న్యాయమూర్తులు తమ ఛాంబర్‌లోనే పరిశీలిస్తారు. అయితే అవసరమైతే ఓపెన్ కోర్టులో కూడా విచారణకు అనుమతి ఇవ్వవచ్చు. గత జనవరి 5న సుప్రీంకోర్టు ఖలీద్‌కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే కేసులో ఉన్న షర్జీల్‌ఇమాంకు కూడా బెయిల్ నిరాకరించగా, మరో ఐదుగురికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఖలీద్, ఇమామ్‌లపై ఉన్న ఆరోపణలు ఇతరుల కంటే తీవ్రమైనవిగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. అదే సమయంలో విచారణలో సాక్షుల విచారణ పూర్తయ్యాక లేదా ఒక సంవత్సరం తర్వాత మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం, ఖలీద్, ఇమామ్‌లు అల్లర్లకు సంబంధించిన ప్లానింగ్, మోబిలైజేషన్, వ్యూహాత్మక దిశానిర్దేశంలో కీలక పాత్ర పోషించారని అభియోగాలు ఉన్నాయి. అందుకే అన్‌లాపుల్ యాక్ట్ కింద బెయిల్ ఇవ్వడానికి చట్టపరమైన పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది. ఈ కేసులో మొత్తం 18 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇప్పటివరకు 11 మందికి బెయిల్ లభించింది. ఖలీద్, ఇమామ్‌లు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖాలిద్ దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
