
ఢిల్లీ అల్లర్ల కేసులో నలుగురు నిందితుల విడుదలకు కోర్టు ఉత్తర్వులు
2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నలుగురు నిందితుల విడుదలకు ఢిల్లీ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధించిన అన్ని బెయిల్ షరతులు నెరవేర్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బజ్‌పాయ్, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్ సమర్పించిన రూ.2 లక్షల చొప్పున బెయిల్ బాండ్లు, సమాన మొత్తానికి ఇద్దరు స్థానిక హామీదారులను ఆమోదించి విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఐదుగురు నిందితుల్లో ఒకరైన షాదాబ్ అహ్మద్ ఇప్పటివరకు కోర్టుకు హాజరై బెయిల్ బాండ్లు సమర్పించకపోవడంతో అతని విడుదల నిలిచిపోయింది. నిందితులు సమర్పించిన పత్రాలు, హామీదారుల వివరాలపై ఢిల్లీ పోలీసులు విచారించిన ధృవీకరణ నివేదికలు అందిన తర్వాతే కోర్టు విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు విధించిన అన్ని షరతులను నిందితులు పాటించినట్లు కోర్టు పేర్కొంది. ఇంతకుముందు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన ఐదుగురిలో నలుగురి పత్రాల ధృవీకరణ చేయాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించడంతో వారి విడుదల ఒకరోజు ఆలస్యమైంది. ఈ కేసులో కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. వారు పాల్గొన్న స్థాయి (హైరార్కీ ఆఫ్ పార్టిసిపేషన్) భిన్నంగా ఉందని పేర్కొంటూ మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లపై యూఏపీఏ కింద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం స్పష్టం చేసింది.
షరతులు విధించిన కోర్టు
బెయిల్ షరతుల ప్రకారం, నిందితులు రూ.2 లక్షల విలువైన వ్యక్తిగత పూచీకత్తు బాండ్‌తో పాటు అదే మొత్తానికి ఇద్దరు స్థానికుల జామీన్ సమర్పించాలి. అలాగే ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీటీ)ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ప్రయాణానికి అనుమతి కోరిన సందర్భంలో, ప్రయాణ కారణాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుందని, ఆ అభ్యర్థనను ట్రయల్ కోర్టు పూర్తిగా దాని సారాంశాన్ని బట్టి మాత్రమే పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. అదనంగా, నిందితులు తమ పాస్‌పోర్టులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ప్రస్తుత నివాస చిరునామా, సంప్రదింపు ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ వివరాలను దర్యాప్తు అధికారికి మరియు ట్రయల్ కోర్టుకు అందజేయాలని సూచించింది. ఈ వివరాలను సమర్పించేందుకు మూడు నుంచి నాలుగు రోజుల గడువు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. చాలా కాలంగా నిందితుల మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదని, సేవలు పునరుద్ధరించిన వెంటనే వివరాలను సమర్పిస్తామని వారు హామీ ఇచ్చారు.
గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా-ఉర్-రెహమాన్, మహమ్మద్ సలీం ఖాన్, షదాబ్ అహ్మద్ – వీరు వారంలో రెండుసార్లు (సోమవారం, గురువారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలి. కేసుకు సంబంధించిన ఎవరినైనా సంప్రదించడం, ప్రభావితం చేయడం, బెదిరించడం నిషేధమని, ఈ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన ఏ సంస్థ లేదా సమూహా కార్యకలాపాల్లో పాల్గొనరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
