
ఢిల్లీలో 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా
జాతీయ రాజధానిలో ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త బస్సుల చేరికతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మొత్తం బస్సుల సంఖ్య 6,100కు చేరుకుంది.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే డీటీసీ నష్టాలను తగ్గించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో డీటీసీలోని అన్ని బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈవీ సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని, దీనివల్ల వాహనదారులకు భారీ ఊరట లభిస్తుందని ఆమె తెలిపారు.
దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు కలిగిన నగరంగా ఢిల్లీ రికార్డు సృష్టించిందని ఆమె పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఢిల్లీ, ఘాజియాబాద్ మధ్య నడిచే నూతన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసును కూడా ఆమె ప్రారంభించారు.
గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని, అభివృద్ధి పనులను గాలికొదిలేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. చివరి మైలు వరకు కనెక్టివిటీని పటిష్టం చేయడం ద్వారా సామాన్యులకు రవాణా కష్టాలు తీరుస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
