
ఢిల్లీలో స్లీపర్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి
జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఒక స్లీపర్ బస్సు బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఉదయం సుమారు 1 గంట సమయంలో ఢిల్లీలోని జండేవాలన్ హనుమాన్ మందిర్ సమీపంలో జరిగింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు ఒక రౌండబౌట్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం, దుమ్ము మబ్బులు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు బయటకు రావడానికి అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి వారిని బయటకు తీసుకువచ్చారు. సమీపంలో ఉన్న జేసీబీ సహాయంతో బస్సును పైకి లేపారు. గాయపడిన వారిలో 10 మందిని సర్ గంగా రామ్ హాస్పిటల్కి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరో 12 మందిని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చేర్పించారు. ఒకరిని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్కు తరలించారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన షెహబాజ్ అలం (30), మహేష్ (22) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 15 మంది రోగులను అత్యవసర విభాగంలో చేర్చగా, అందులో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన వారిలో 13 మంది (ముగ్గురు మహిళలు) విషమ పరిస్థితిలోనే ఉన్నారన్నారు.
డ్రైవర్‌పై కేసు
బస్సు డ్రైవర్ పంకజ్ కుమార్ (26) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసింనందుకు, ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి కేసులు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బస్సు వేగంగా వెళ్తుండటమే ప్రధాన కారణమని, ఒక ఆటోను తప్పించేందుకు డ్రైవర్ ఒక్కసారిగా మలుపు తిప్పడం వల్ల బస్సు బోల్తా పడినట్టు తెలిపారు. అలాగే బ్రేక్ ఫెయిల్యూర్ కూడా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
