
ఢిల్లీలో రెండు రోజులకే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి:నితిన్ గడ్కరీ
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగం వల్లే సుమారు 40 శాతం కాలుష్యం పెరుగుతోందని ఆయన స్వయంగా అంగీకరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రముఖ జర్నలిస్టు ఉదయ్ మహుర్కర్ రచించిన ‘ మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్–రెడిఫైనింగ్ అన్ అలైయ్డ్ నేషనలిజం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.
నేను ఢిల్లీలో కేవలం రెండు రోజులు ఉంటేనే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఢిల్లీ ఇంతగా కాలుష్యంతో ఎందుకు బాధపడుతోంది? అని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రినైన తానే ఈ సమస్యకు ఒక కారణమని పేర్కొంటూ రవాణా రంగం వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. ఈ విషయంలో బాధ్యత మాదే అని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా, దేశం ప్రతి సంవత్సరం రూ.22 లక్షల కోట్ల విలువైన శిలజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడంపై గడ్కరీ ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత భారీగా డబ్బు ఖర్చు చేసి ఇంధనాలు దిగుమతి చేసుకుంటూ, మన దేశాన్నే కాలుష్యం చేస్తున్నాం. ఇదేనా నిజమైన జాతీయత? ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయో ఫ్యూయల్స్‌లో స్వయం సమృద్ధి సాధించలేమా? అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టంగా విషపూరిత పొగమంచు (స్మాగ్) కమ్మేసింది. ఐటీఓ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, ఐటీఓ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 374గా నమోదై, ఇది ‘వెరీ పూర్’ (చాలా దారుణం) కేటగిరీలోకి చేరింది. పరిస్థితి మరింత దిగజారడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో జీఆర్ఏపీ స్టేజ్–IV కింద కఠిన చర్యలను అమలు చేసింది.
కాలుష్యంపై దృష్టి మళ్లించేందుకు ఎల్‌జీ ప్రయత్నం: ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీలో తీవ్రమవుతున్న కాలుష్య సంక్షోభం మధ్య, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇది సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చేసిన రాజకీయ నాటకం అని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ ప్రజలు తీవ్రమైన కాలుష్యంతో ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే, ఎల్‌జీ మాత్రం గుజరాత్‌లో విహారయాత్రలు చేస్తూ తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించారని ఆప్ విమర్శించింది.
ఎల్జీ జ్ఞాపకశక్తి దెబ్బతిన్నట్లుంది
కాలుష్యం ఢిల్లీ ప్రజల ఊపిరితిత్తులకే కాదు, ఎల్‌జీ జ్ఞాపకశక్తికీ ప్రభావం చూపినట్లుంది. అందుకే ప్రస్తుతం సీఎం అయిన రేఖా గుప్తాను ప్రశ్నించకుండా, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాస్తున్నారు అని ఎద్దేవా చేసింది. తన సొంత ప్రభుత్వమైన బీజేపీ పట్టించుకోకపోవడంతో, మీడియాలో ప్రాధాన్యం నిలబెట్టుకునేందుకే ఎల్‌జీ ‘లేఖల నాటకం’ చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. కాలుష్య నియంత్రణలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్‌జీని ముందుకు నెడుతోందని పేర్కొంది.
మీడియాతో మాట్లాడిన ఆప్ జాతీయ మీడియా ఇన్‌చార్జి అనురాగ్ ధండా ఎల్‌జీ గుజరాత్ నుంచి తిరిగి వచ్చినా పరిస్థితి తీవ్రత ఆయనకు అర్థమైనట్టు లేదన్నారు. అదేవిధంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దో నమూనే’ (రెండు నమూనాలు) అంటూ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ, ఒక నమూనా పది నెలల్లోనే తన అసమర్థతను చూపించింది. ఇప్పుడు రెండో నమూనా మీడియా దృష్టి కోసం చేతులు ఎత్తుతోంది అని ధండా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎల్‌జీని కెమెరాల పిచ్చి ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలే ఆయనను వేదికపై నుంచి దించేస్తున్నారు. అందుకే ఆయన నిరాశలో తిరుగుతున్నారని వ్యంగ్యం దట్టించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాన్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ధండా ప్రశ్నించారు. ఆప్ ప్రతినిధి ఘనేంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నంతకాలం, ఎల్‌జీ పని ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, విమర్శించడం మాత్రమే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, సీఎం రేఖా గుప్తాపై ప్రజలు ప్రశ్నలు వేస్తున్నా, ఎల్‌జీ మాత్రం మౌనంగా ఉన్నారని అన్నారు.
