
ఢిల్లీలో మహిళా గిగ్ వర్కర్ల ఆందోళన
ఉద్యోగ హోదా గుర్తింపు, అకౌంట్ల యాదృచ్ఛిక బ్లాకింగ్, తక్కువ ఆదాయం, ప్రాథమిక కార్మిక రక్షణల లేమిపై నిరసన వ్యక్తం చేస్తూ గిగ్ వర్కర్లు, వారిలో ఉన్న ఎక్కువ మంది మహిళలు మంగళవారం జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనను మహిళల నేతృత్వంలోని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (జీపీఎస్ఐడబ్ల్యూయూ) నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని యూనియన్ తెలిపింది.
పంజాబీ బాగ్‌లో హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తున్న సునీత మాట్లాడుతూ ఆందోళనలో పాల్గొనడంతోనే ఈరోజు దాదాపు రూ.900 ఆదాయం కోల్పోయాను అని చెప్పారు. సౌకర్యవంతమైన పని గంటలు, స్థిరమైన ఆదాయం ఉంటుందని చెప్పడంతో గిగ్ పనిలోకి వచ్చానని, కానీ ఇప్పుడు అకౌంట్ ఎప్పుడైనా బ్లాక్ అవుతుందన్న భయంతో జీవిస్తున్నానని వాపోయారు. మొదట్లో బుకింగ్స్ ఎక్కువగా వచ్చేవి. కుటుంబాన్ని చూసుకోగలనని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా నా ఐడీ బ్లాక్ చేశారని ఆవేదన చెందారు.
మరో మహిళా నిరసనకారిణి మాట్లాడుతూ నాలుగేళ్లకు పైగా అదే కంపెనీలో పనిచేసిన తన అకౌంట్‌ను 2022లో సస్పెండ్ చేశారని తెలిపారు. కొద్ది నెలలకే భర్త మరణించడంతో జీవనాధారం కోల్పోయానని చెప్పారు. తరువాత నెలకు రూ.15,000 జీతంతో వంట పనికి వెళ్లినా, యజమాని కుటుంబం ఢిల్లీ వదిలి వెళ్లడంతో ఆ ఉద్యోగం కూడా పోయిందని తెలిపారు. నిరసనలో పాల్గొన్న పలువురు మహిళలు ముఖాలు కప్పుకుని ఉన్నారు. తమను గుర్తిస్తే ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి ప్రతీకారం ఉంటుందన్న భయంతోనే ఇలా చేశామని వారు చెప్పారు. చాలా ఎక్కువ పని గంటలు చేసినప్పటికీ, కమిషన్లు, తప్పనిసరి చార్జీలు తీసేయగా చేతికి చాలా తక్కువ మొత్తం మాత్రమే మిగులుతోందని పలువురు ఆరోపించారు. సునీత వివరాల ప్రకారం, ఇటీవల ఆమెకు రూ.2,295 విలువైన బుకింగ్ రాగా, అందులో నుంచి రూ.431 కమిషన్‌గా, రూ.970 ‘తప్పనిసరి క్రెడిట్ రీచార్జ్’గా కట్ అయ్యాయి. క్రెడిట్ చెల్లించకపోతే బుకింగ్స్ రావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా చివరకు మిగిలేది ఇదే అని ఆమె అన్నారు. కంపెనీ ఉత్పత్తులు కొనాలని ఒత్తిడి చేస్తారని కూడా చెప్పారు.
అనేక సమస్యలు
యూనియన్ నాయకుల ప్రకారం సమస్యలు జీతాలకే పరిమితం కావు. జీపీఎస్ఐడబ్ల్యూయూ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ, అకౌంట్ సస్పెన్షన్, చెల్లింపుల వివాదాలు, భద్రతా సమస్యల విషయంలో ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత తప్పించుకుంటున్నాయని ఆరోపించారు. ఏదైనా తప్పు జరిగితే మనిషి మద్దతు ఉండదు. గురుగ్రామ్‌లోని కంపెనీ కార్యాలయాలకు వెళ్లినా పరిష్కారం లేకుండా పంపిస్తారు. కొన్నిసార్లు లోపలికి కూడా అనుమతించరని ఆమె అన్నారు. మహిళా వర్కర్లకు లైంగిక వేధింపులు, రాత్రి వేళల భద్రతా ప్రమాదాల విషయంలో తగిన సహాయం అందడం లేదని సీమా సింగ్ తెలిపారు.
వాళ్లు ఇచ్చేది ఒక ఏఐ చాట్‌బాట్ మాత్రమే. అది వేధింపులు ఎదుర్కొంటున్న మహిళకు సహాయం చేయలేదని ఆమె విమర్శించారు.
జీపీఎస్ఐడబ్ల్యూయూ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం, దేశంలో గిగ్ వర్కర్లలో ప్రతి నలుగురిలో ఒకరు వారానికి 70 గంటలకుపైగా పనిచేస్తుండగా, సగానికి పైగా 49 గంటలకంటే ఎక్కువ పని చేస్తున్నారు. తక్కువ జీతాలు, సురక్షితం కాని పని పరిస్థితులు, కఠిన గడువులపై నిరసనగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఢిల్లీలో గిగ్ వర్కర్లు సమ్మె చేసిన కొన్ని వారాలకే ఈ తాజా ఆందోళన చోటుచేసుకుంది.
