
ఢిల్లీలో మహిళల సంక్షేమానికి పెద్దపీట
మహిళల భద్రత, స్వావలంబనకు దోహదపడే నాలుగు కీలక సంక్షేమ పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన “సశక్తి నారీ, సమృద్ధ ఢిల్లీ” కార్యక్రమంలో ఈ పథకాలను ఆవిష్కరించారు.
పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు
మహిళల ఉచిత బస్ ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సమగ్ర రవాణా సదుపాయాలతో అనుసంధానించే పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును రాష్ట్రపతి ప్రారంభించారు. ఉచిత ప్రయాణం, అందుబాటులో సమగ్ర రవాణా వంటి చర్యలు మహిళల స్వతంత్రత, భద్రతను బలోపేతం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా మెట్రో, రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో చెల్లింపు ప్రయాణం కూడా చేయవచ్చు. దాదాపు 50 డీఎం/ఎస్‌డీఎం కార్యాలయాలు, ఎంపిక చేసిన డీటీసీ కేంద్రాల్లో ఈ కార్డులు జారీ చేస్తారు. ఆధార్ ద్వారా అర్హతను నిర్ధారించి, లబ్ధిదారుడి మొబైల్ నంబర్‌కు లింక్ చేస్తారు. ప్రజా రవాణాను మరింత సులభం, సురక్షితం, డిజిటల్ చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని సీఎం తెలిపారు.
ఉచిత ఎల్పీజీ సిలిండర్లు
రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు హోళీ, దీపావళి సందర్భంగా సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే పథకాన్ని కూడా ప్రారంభించారు. రూ.129 కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా అందజేస్తారు. సుమారు 15.50 లక్షల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా లాభపడనున్నాయి.
‘లఖ్‌పతి బిటియా’, ‘మెరీ పూన్జీ, మేరా అధికార్’
ఇవే కాకుండా ఢిల్లీ లఖ్‌పతి బిటియా యోజన, ‘మెరీ పూన్జీ, మేరా అధికార్’ కార్యక్రమాలను కూడా రాష్ట్రపతి ఆవిష్కరించారు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగిన మహిళలు సమాజం, దేశ దిశను మార్చగలరని ఆమె పేర్కొన్నారు. మహిళ సాధికారత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక, సమాజం మొత్తం బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. బిటియా పథకం కింద కుమార్తెల ఆర్థిక సాధికారతపై దృష్టి సారించారు. రూ.56,000ను విడతలవారీగా బాలిక పేరుపై జమ చేస్తారు. వడ్డీతో కలిపి 21 ఏళ్ల వయసుకు చేరేసరికి అది రూ.1 లక్షకు పైగా చేరేలా ఉంటుంది. విద్యా ప్రమాణాలు పూర్తిచేసిన తర్వాత పరిపక్వత ప్రయోజనాన్ని ఆధార్-లింక్ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేస్తారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి, గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీలో నివాసం ఉండాలి, బాలిక ఇక్కడే జన్మించి ఉండాలి. ఒక్క కుటుంబానికి గరిష్ఠంగా ఇద్దరు బాలికలకే ప్రయోజనం వర్తిస్తుంది. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ లేదా ప్రొఫెషనల్ డిప్లొమా చదువుతున్న వారికీ ఈ లాభం అందుతుంది. మెరీ పూన్జీ పథకం కింద పెండింగ్ బకాయిలను పారదర్శకంగా, సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకుంటారు. పౌరుల ఆర్థిక హక్కులను కాపాడటమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
మహిళలకు ఉపశమనం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, ఈ నాలుగు పథకాలు మహిళల భద్రత, స్వతంత్రతకు సమగ్ర రూపకల్పనగా ఉంటాయని అన్నారు. ఈ రోజును ఢిల్లీలో మహిళ సాధికారత, డిజిటల్ పారదర్శకత, సామాజిక భద్రతలో కొత్త యుగానికి నాందిగా అభివర్ణించారు. పాప పుట్టినప్పటి నుంచి విద్యలో పెట్టుబడి, రవాణా స్వేచ్ఛ, వంటింటి ఉపశమనం వరకు మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం ఈ పథకాలు రూపొందించిందని చెప్పారు. మునుపటి ప్రభుత్వ ఉచిత బస్ ప్రయాణ పథకంలో అవకతవకలకు అవకాశం ఉన్నదని, ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘సాహేలీ పింక్ స్మార్ట్ కార్డు’ కేవలం ప్రయాణ కార్డు మాత్రమే కాక, ఢిల్లీ మహిళల గౌరవానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. మహిళ సాధికారత ఇప్పుడు కేవలం విధానం కాదు, జాతీయ సంకల్పమని, మహిళలు ఉద్యోగ రంగంలోనూ మరింత భాగస్వామ్యం కావాలని సీఎం ఆకాంక్షించారు.
