
ఢిల్లీలో మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకూ ఉచిత బస్సు ప్రయాణం
ఢిల్లీ ప్రభుత్వం మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మహిళలు, ట్రాన్స్‌జెండర్ ప్రయాణికుల ఉచిత ప్రయాణానికి ‘పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్’ను ప్రారంభించింది. ఆదివారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్డ్‌తో 12 ఏళ్ల పైబడిన కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు ఢిల్లీలోని డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ‘పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్ ప్రారంభించాం. ఇది మహిళా శక్తికి గౌరవం ఇవ్వడమే కాకుండా, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆమె ఎక్స్’లో పోస్టు చేశారు.
వివిధ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణాలు
• కర్ణాటకలో శక్తి స్కీం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 11 జూన్ 2023 న ఆ ప్రభుత్వం ప్రారంభించింది.
• తెలంగాణలోనూ మహిళలకు ‘మహలక్ష్మీ’ పథకంలో భాగంగా బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
• ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి పేరుతో ఆ రాష్ట్రంలో మహిళలకు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభమైంది.
• పంజాబ్ లోనూ మహిళల ఉచిత బస్సు ప్రయాణం స్కీం అమలులో ఉంది. తాజాగా ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు ఢిల్లీ సర్కార్ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది.
ఇదే సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ మరో కీలక నిర్ణయం వెల్లడించారు. ఢిల్లీలోని నాన్-కన్ఫార్మింగ్ ఏరియాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కి అధికారిక గుర్తింపు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దశాబ్ద కాలంగా ఈ పాఠశాలలకు గుర్తింపు లభించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు విద్యా హక్కుకు దూరమయ్యారని ఆయన తెలిపారు. గతంలో ఉన్నప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు కొంతమందికి గుర్తింపు ఇస్తూ, మరికొందరిని విస్మరించాయి. రేఖా గుప్తా నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ఆ వివక్షకు ముగింపు పలికింది. ఇది కేవలం పరిపాలనా సంస్కరణ కాదు, మన పిల్లల హక్కుల సాధన అని సూద్ పేర్కొన్నారు.ఈ పాఠశాలలు నవంబర్ 30లోగా ఢిల్లీ విద్యాశాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అనంతరం పరిశీలన జరిపి అర్హత పొందిన పాఠశాలలకు గుర్తింపు జారీ చేయనున్నారు.
