
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400కు పైగా నమోదవడంతో, దీన్ని ప్రమాదకర స్థాయిగా అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితి నగరవాసుల్లో తీవ్రమైన ఆరోగ్య ఆందోళనలను కలిగిస్తోంది. ఆనంద్ విహార్, షాదీపూర్ లో 445, వజీర్ పూర్ లో 435 గా గాలినాణ్యత నమోదైంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విమానయాన, రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. జీఆర్ఏపీ–4వ దశను ఇక శాశ్వతంగా అమలు చేస్తామని, పెట్రోల్, డిజీల్ వాహానాలను ఢిల్లీలోపలికి అనుమతించమని మంత్రి మజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. అనవసరంగా బయటకు రావద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే కాలుష్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలకు అధికారుల సూచనలు
• కాలుష్యం ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
• బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి
• ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించాలి
• పిల్లలు, వృద్ధులు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)తో పాటు ఇతర సంబంధిత సంస్థలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే అదనపు నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
వాహనాల సంఖ్య తగ్గించడమే లక్ష్యం: ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ ప్రభుత్వం గాలి కాలుష్య నియంత్రణ కోసం రవాణా రంగంలో అనేక సంస్కరణలు చేపడుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో వెల్లడించింది. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గించకుండా కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. అలాగే కాలుష్యాన్ని పెంచే వాహనాలు రోడ్లపై తిరగకుండా ఉండేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఒక వాహనంలో ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేలా చేయడం ఢిల్లీ ప్రభుత్వ రవాణా విధానంలోని ప్రధాన లక్ష్యం. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం అని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. తక్కువ వాహనాలతో ఎక్కువ మందిని సురక్షితంగా, సౌకర్యవంతంగా రవాణా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఓలా, ఉబర్‌తో చర్చలు
ప్రభుత్వం ఇప్పటికే ఓలా, ఉబర్ వంటి రవాణా నెట్‌వర్క్ సంస్థలతో నిరంతరం చర్చలు జరుపుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ చర్చల్లో షేర్డ్ రైడ్స్‌కు ప్రాధాన్యం, మహిళా డ్రైవర్ల సంఖ్య పెంపు, పర్యావరణ హిత సేవల ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి ముందు ఢిల్లీలో అందుబాటులో ఉన్న షేర్డ్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలను ట్యాక్సీ సేవల్లోకి తీసుకురావడంపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు. తక్కువ వాహనాలతో ఎక్కువ మందిని సురక్షితంగా, చౌకగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ట్రాఫిక్ రద్దీతో పాటు గాలి కాలుష్యాన్ని కూడా తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
