
ఢిల్లీలో పోలీసులతో మమతా బెనర్జీ ఘర్షణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ భవన్ బయట మోహరించిన ఢిల్లీ పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా జాబితా (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వల్ల నష్టపోయిన కుటుంబాలను ఢిల్లీకి తీసుకొచ్చినందుకు పోలీసులు వారిని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో బంగ భవన్ పరిసరాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడారు. ఎస్‌ఐఆర్ బాధితులు ఎన్నికల సంఘానికి తమ సమస్యలు విన్నవించేందుకు ఢిల్లీకి వచ్చారని, అయితే వారిపై అనవసర ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. చుట్టూ భారీగా పోలీసులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే నేను ఢిల్లీ పోలీసులను నిందించడం లేదు. పై స్థాయిలో ఉన్నవారినే నిందిస్తున్నాను అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆమె పరోక్షంగా ఉద్దేశించారు.
ఎస్‌ఐఆర్ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో సమావేశానికి హాజరయ్యేందుకు మమతా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది ఎస్‌ఐఆర్ బాధిత కుటుంబాలను ఢిల్లీకి తీసుకువచ్చి, బంగ భవన్ సహా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెందిన అతిథి గృహాల్లో వసతి కల్పించారు. వీరిలో కొందరిని సోమవారం ఎన్నికల సంఘ సమావేశానికి కూడా తీసుకెళ్లారు. సోమవారం ఉదయం బంగ భవన్‌కు చేరుకున్న మమతా, అక్కడ ఉన్న పోలీసులను ఉద్దేశించి, బాధిత కుటుంబాల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. మా విషయం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఎన్నికల సంఘంతో అధికారిక సమావేశం ఉంది. ప్రజలు చనిపోయారు. వారి కుటుంబాలు మీడియాతో మాట్లాడే హక్కు లేదా? అని ఆమె ప్రశ్నించారు.
ఎస్‌ఐఆర్ వల్ల బాధపడ్డ అనేక కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వారు ఉన్న ప్రతి చోటా ఢిల్లీ పోలీసులే. ఢిల్లీలో పేలుళ్లు జరిగితే పోలీసులు ఎక్కడ ఉన్నారు? అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడలేని వారు, ఎస్‌ఐఆర్ పేరుతో బెంగాల్ ప్రజలను వేధిస్తున్నారు. నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా వారికి భయం పట్టుకుంటుంది. కావాలంటే లక్షల మందిని తీసుకురాగలనని వ్యాఖ్యానించారు.
ఇక్కడికి ఆందోళన చేయడానికి రాలేదు
ఢిల్లీ ‘జమీందారీ’లా మారిందని, పేదలకు ఇక్కడ చోటు లేదని కూడా ఆమె అన్నారు. నేను ఆందోళనకు రాలేదు. అలా వచ్చుంటే మీ పరిస్థితి వేరేలా ఉండేదంటూ పోలీసులకు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీఎంసీ ఎంపీలు సాకేత్ గోఖలే, డోలా సేన్, బాపి హాల్దార్, కాకోలి ఘోష్ దస్తిదార్ తదితరులు, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్‌ఐఆర్ బాధిత కుటుంబాల వద్దకు చేరుకున్నారు. కైలాశ్ కాలనీలోని పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులతో సాకేత్ గోఖలే వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న బాధితులను బయటకు వస్తే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారని ఆయన ఆరోపించారు. తన జోక్యం తరువాత పోలీసులు అక్కడ నుంచి బస్సును తొలగించి, భద్రతా సిబ్బందిని తగ్గించారని గోఖలే తెలిపారు. వారు బెంగాలీలు, బంగ్లా మాట్లాడతారనే కారణంతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఈ అంశాన్ని రాజ్యసభలో టీఎంసీ ఉపనేత సాగరికా ఘోష్ కూడా లేవనెత్తారు. ఎస్‌ఐఆర్ బాధితులను ఢిల్లీ పోలీసులు వేధించారని ఆమె ఆరోపించారు. టీఎంసీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. తర్వాత మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి హేలీ రోడ్డులోని బంగ భవన్‌లో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ మమతా బెనర్జీ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
