
ఢిల్లీలో పార్కింగ్ ఛార్జీలు డబుల్
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరుగుతున్న నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్–II అమల్లోకి తీసుకువచ్చింది. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించేలా పార్కింగ్ ఛార్జీలను రెండింతలు పెంచింది. ఎన్‌డీఎంసీ బుధవారం విడుదల చేసిన నోటీసులో పార్కింగ్ చార్జీలు, తదితర వివరాలను పేర్కోంది. ఈ కొత్త రేట్లు స్టేజ్–II ఎత్తివేసేవరకు(అంటే ఢిల్లీలో కాలుష్య స్థాయి తగ్గే వరకు) కొనసాగుతాయి. తదనంతరం గాలి నాణ్యత పెరిగితే చార్జీలను ఎత్తేస్తామని ప్రకటించింది.
• కార్లకు గంటకు రూ.20 నుంచి రూ.40కి పెంపు
• టూ-వీలర్లకు రూ.10 నుంచి రూ.20కి
• బస్సులకు రూ.150 నుంచి రూ.300కి పెంచారు.
ఇక ఇండోర్ పార్కింగ్ ఫీజును కూడా రెండింతలు చేశారు. కార్లకు రూ.10 నుంచి రూ.20కి, స్కూటర్లకు రూ.5 నుంచి రూ.10కి పెంచారు. అయితే ఆన్-స్ట్రీట్ పార్కింగ్, మంత్లీ పాస్ హోల్డర్లకు ఈ పెంపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
క్షీణించిన వాయు నాణ్యత
అక్టోబర్ 19న జరిగిన గ్రాప్ సబ్ కమిటీ సమావేశంలో ఢిల్లీ వాయు నాణ్యత మరింత దిగజారిందని అధికారులు గుర్తించారు. ఆ రోజు ఏక్యూఐ సాయంత్రం 4 గంటలకు 296గా ఉండగా, 7 గంటలకు 302కి చేరింది. ఇది వెరీ పూర్ కేటగిరీ (ఏక్యూఐ 301–400)లోకి వస్తుంది. ఐఎండీ, ఐఐటీఎం అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంది.
నవంబర్ 1 నుంచి బీఎస్–6 కాని ట్రక్కులకు నో ఎంట్రీ
ఇక కాలుష్య నియంత్రణలో భాగంగా కమిషన్ ఫర్ ఏయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోకి బయట రాష్ట్రాల నుంచి వచ్చే బీఎస్–6 ప్రమాణం లేని ట్రాన్స్‌పోర్ట్/కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. సీఎన్జీ , ఎల్ఎన్జీ, ఈవీ, బీఎస్–6 డీజిల్ వాహనాలకే అనుమతి ఉంటుంది. అయితే ముఖ్యమైన సరుకులు, సేవలు అందించే వాహనాలకు తాత్కాలికంగా 2026 అక్టోబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత ఇవి కూడా బీఎస్–6 లేదా పర్యావరణ అనుకూల వాహనాల ద్వారానే నడపాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు సహకరించి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచాలని ఎన్‌డీఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
