
ఢిల్లీలో నకిలీ కందెన నూనె కర్మాగారం బట్టబయలు
దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ కందెన నూనె (లూబ్రికెంట్ ఆయిల్) తాయారు చేసే ఒక కర్మాగారంపై పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేసి, భారీ మోసరాకెట్‌ను బట్టబయలు చేశారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల పేర్లను దుర్వినియోగం చేస్తూ, నాణ్యతలేని నూనెను ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లతో ప్యాక్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ఒక అక్రమ కర్మాగారాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భారీ మొత్తంలో నకిలీ నూనె, ప్యాకేజింగ్ సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గోకుల్‌పురి ప్రాంతంలో దాడి
ఈ దందా ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ప్రాంగణంలో నడుస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఒక ప్రైవేటు కంపెనీ ప్రతినిధి సమక్షంలో కర్మాగారంపై దాడి చేసింది. అధికారులు జరిపిన ఈ దాడిలో సుమారు 4,000 లీటర్ల నకిలీ కందెన నూనె, అదేవిధంగా నూనెను సీల్ చేయడానికి, వేడి చేయడానికి, లేబులింగ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మోసం
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ యూనిట్‌లో నాణ్యత లేని తక్కువ స్థాయి నూనెను ఉపయోగించి, అసలైన బ్రాండ్ల కంటైనర్లు, స్టిక్కర్లు, హోలోగ్రామ్‌లను వాడి, క్యాస్ట్రోల్, షెల్, హెచ్‌పీ, సర్వో వంటి కంపెనీల లేబుళ్లతో నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ ఉత్పత్తులను చిరు వ్యాపారుల ద్వారా మార్కెట్లో, వర్క్‌షాప్‌లకు సరఫరా చేసేవారు.
ఇక ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని షహదారాకు చెందిన నవీన్ సింఘాల్ (50)గా పోలీసులు గుర్తించారు. ఇతడు నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులను తన దగ్గర పనిలో పెట్టుకొని ఈ అక్రమ యూనిట్‌ను నడుపుతున్నాడు.అంతేకాక నకిలీ నూనె తయారీలో ఉపయోగించే ముడి నూనె, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను స్థానిక మార్కెట్ల నుంచి తెచ్చి, ప్రముఖ బ్రాండ్ల స్టాక్‌గా చూపించి చిల్లర ధరలకు విక్రయించేవాడు. ప్రతి నెలా సుమారు 8,000 నుండి 10,000 లీటర్ల నకిలీ నూనెను తయారు చేసి దాదాపు రూ. 5 లక్షల వరకు అక్రమంగా సంపాదించేవాడు.
పోలీసులు తెలిపిన అదనపు సమాచారం ప్రకారం నిందితుడు నవీన్ సింఘాల్‌కు పాత నేర చరిత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇతడు 2004 నుంచే ఇలాంటి నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలుపంచుకుంటూ ఇప్పటికే మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటిలో రెండు కాపీరైట్ ఉల్లంఘన కేసులుగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు .
ఈ రాకెట్ వెనుక ఉన్న సరఫరాదారులు, వ్యాపార నెట్వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా వాహన యజమానులు, గ్యారేజ్ యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ ధరలకు లభిస్తున్న కందెన నూనెలు అసలైనవా కాదా అన్నది పరిశీలించి కొనుగోలు చేయాలని హెచ్చరించారు. నకిలీ నూనె వాడకం వాహనాల ఇంజిన్ పనితీరును దెబ్బతీసి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
