
ఢిల్లీలో జాత్యహంకార దూషణలు సిగ్గుచేటు: సీఎం పెమాఖండూ
ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మహిళలపై జరిగిన జాత్యహంకార దూషణ ఘటనను మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయా నగర్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో అద్దెకు నివసిస్తున్న అరుణాచల్‌కు చెందిన ముగ్గురు మహిళలు, తమ ఫ్లాట్‌లో మరమ్మతుల పనుల సందర్భంగా పొరుగువారితో తలెత్తిన వివాదం అనంతరం జాత్యహంకార దూషణలు, బెదిరింపులకు గురయ్యారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన ఫిబ్రవరి 20న మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నాలుగో అంతస్తులోని వారి ఫ్లాట్‌లో డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి.
ఈ ఘటనపై ఎక్స్‌లో స్పందించిన ఖండూ మాలవీయా నగర్‌లో నివసిస్తున్న మన అరుణాచల్ యువ సోదరీమణులపై జరిగిన జాత్యహంకార దూషణ సిగ్గుచేటు. ఇటువంటి ప్రవర్తన అసహ్యకరం; మన సమాజంలో దీనికి స్థానం లేదని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను. కమిషనర్ నాతో నేరుగా సంప్రదిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సీఎం తెలిపారు.
పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలి
అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఏపీఎస్సీడబ్ల్యూ) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది రాజ్యాంగంలో నిక్షిప్తమైన సమానత్వం, గౌరవం, ఈశాన్య భారత మహిళల ప్రతిష్టకు వ్యతిరేకంగా జరిగిన ఘోర ఉల్లంఘనగా పేర్కొంది. పక్షపాతం లేకుండా, నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను కోరింది.
ఇక సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పరస్పర గౌరవం, గౌరవప్రదమైన ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి. ఈశాన్య భారతదేశం దేశానికి అవిభాజ్య భాగం. ప్రతి పౌరుడూ సమానత్వం, గౌరవానికి అర్హుడు. పరస్పర అవగాహన, గౌరవం మీద ఆధారపడిన సమాజం నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
