
ఢిల్లీలో గాలి కాలుష్య నివారణకు గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు
రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) మంగళవారం గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-లోని మూడో దశ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ‘అత్యంత ప్రమాదకర స్థాయి’కి చేరిన వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
సోమవారం 362గా ఉన్న గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం ఉదయం 425కి పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు, గాలులు నిలకడగా ఉండటం, తేమ పెరగడం వలన కాలుష్యం మరింత పెరిగిందని సీఏక్యూఎం తెలిపింది. స్టేజ్-3లో భాగంగా నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. అయితే రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్ట్ వంటి అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చారు. అనుమతించని ఇంధనాలు ఉపయోగించే పరిశ్రమలు తక్షణమే మూసివేయాలని, రోడ్ల శుభ్రపరచడం, నీరు చల్లడం వంటి చర్యలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సీపీసీబీ తాజా గణాంకాల ప్రకారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో మొత్తం ఏక్యూఐ 421గా నమోదైంది.
ప్రాంతాలవారీగా ఆనంద్ విహార్లో 412, అలిపూర్ 442, బవానా 462, ఆర్‌కే పురం 446, పట్పర్‌గంజ్ 438, చాందినీ చౌక్ 416, సోనియా విహార్ 433 గా నమోదైంది. దీపావళి తరువాత ఢిల్లీలో గాలి నాణ్యత నిరంతరం ‘తక్కువ’ నుంచి ‘చాలా ప్రమాదకర’ స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
గాలి నాణ్యత సూచీ ఎన్ని పాయింట్లు చేరిందన్నదాన్ని బట్టి నాలుగు దశలు ఉంటాయి.
• స్టేజ్–1 లో
201–300
(తక్కువ), ఈ దశలో చెత్తను దహనం చేయడం, బహిరంగంగా మండించడం నిషేధం అయితే నీరు చల్లడం, వీధులను శుభ్రం చేయాలి.
• స్టేజ్–2, 301–400 వెరీ పూర్
డీజిల్ జనరేటర్ల వినియోగం నిషేధం, ట్రాఫిక్ నియంత్రణ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెంచడం
• స్టేజ్–3
, 401–450 సీవియర్
నిర్మాణ/కూల్చివేత పనుల నిషేధం, పరిశ్రమలపై ఆంక్షలు, వాహనాల సంఖ్య తగ్గింపు చర్యలు
• స్టేజ్–4
, 450 పైగా సీవియర్+ (అత్యంత తీవ్రం)
విద్యాసంస్థల మూసివేత, వర్క్ ఫ్రం హోమ్ సూచనలు, వాహనాల కదలికపై కఠిన నియంత్రణలు ఉంటాయి. అయితే ఢిల్లీలో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 450 పాయింట్లు దాటింది. మరికొన్ని దరిదాపుల్లో ఉన్నాయి.
