
ఢిల్లీలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి బీహార్ వలస కార్మికుడు మృతి
ఢిల్లీలో రోడ్డుకోసం తవ్విన గుంతలో పడి ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. ఆ ఘటన మరవకముందే తాజాగా ప్రభుత్వం నిర్లక్ష్యంతో తెరుచుకున్న మ్యాన్ హోల్ లో పడి మరో మనిషి చనిపోయాడు. ఏడాదిపాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వగ్రామానికి వెళ్లి కుటుంబాన్ని చూసుకోవాలన్న ఓ వలస కార్మికుడి కలలు ఢిల్లీలోని ఓ మురికి నాలాలో కరిగిపోయాయి. బీహార్‌కు చెందిన 32 ఏళ్ల బిర్జూ కుమార్ రోహిణి సెక్టర్-32లో ఓ ఖాళీ స్థలంలో ఉన్న మూతలేని మాన్‌హోల్‌లో జారి పడిపోవడంతో మృతిచెందాడు.
కార్పెంటర్‌గా పనిచేస్తున్న బిర్జూ నెలకు రూ.13,000 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతూ పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేసి, సోమవారం రైలు ఎక్కడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం సుమారు 2.36 గంటలకు మాన్‌హోల్‌లో పడిపోయినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మురికినాలా నుంచి అతని మృతదేహాన్ని వెలికితీశారు.
సోమవారం ఉదయం బేగంపూర్ మార్కెట్‌కు వెళ్లిన బిర్జూ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అనుమానం. మొదట అతడితో ఉన్న వ్యక్తి కిడ్నాప్ అయ్యాడని చెప్పాడని, తర్వాత ఫోన్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చిందని సునీల్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మాన్‌హోల్‌లో పడిపోయినట్లు స్పష్టం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మూడుగంటల పాటు నీటిని పంపులతో తొలగించి భద్రతా గొలుసులతో మృతదేహాన్ని బయటకు తీశారు. బిర్జూకు ముసలి తల్లి, భార్య, ఐదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అతను మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడని స్నేహితులు తెలిపారు. ప్రయాణ ఖర్చులకు స్నేహితుడు సునీల్ కుమార్ రూ.1,500 అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. మూతలేని మ్యాన్‌హోల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్నేహితులు ఆరోపిస్తున్నారు. బేగంపూర్ పోలీసులు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 285 (ప్రజా మార్గంలో ప్రమాదం సృష్టించడం), 106 (అజాగ్రత్త వల్ల మరణం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ తెలిపారు. ఇటీవలే పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఢిల్లీ జల్ బోర్డు తవ్విన గుంతలో పడిపోయి ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందిన ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపుతోంది.
