
ఢిల్లీలో ఎన్ఆర్ఐ దంపతుల ‘డిజిటల్ అరెస్ట్’ రూ.14 కోట్ల మోసం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ అరెస్ట్ పై ఎంత ప్రచారం చేసినా సైబర్ నేరగాళ్ల మాటలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. తమ సంపదను పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట రూ.14 కోట్లు మోసం చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు.
గ్రేటర్ కైలాష్–II ప్రాంతంలో నివసిస్తున్న 77 ఏళ్ల ఎన్ఆర్ఐ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఈ మోసం డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 9, 2026 మధ్య కాలంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మోసగాళ్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారులమని నటిస్తూ ఆమెకు ఫోన్ కాల్ చేసినట్లు చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తులు ఆమె మొబైల్ నంబర్ ద్వారా అభ్యంతరకరమైన, దుర్భాషలతో కూడిన కాల్స్ మాట్లాడినట్లు ఆరోపించారు. అంతేకాకుండా ఆమె బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ మనీ ఉన్నట్లు గుర్తించామని, మనీ లాండరింగ్ కేసులో ఆమెపై విచారణ జరుగుతోందని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిరంతరం ఫోన్ కాల్స్ తో మానసిక ఒత్తిడి
ఈ క్రమంలో తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నిరంతరం ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. ఈ విధానాన్ని ‘డిజిటల్ అరెస్ట్’గా పోలీసులు పేర్కొన్నారు. మోసగాళ్లు ఆమెను పూర్తిగా భయభ్రాంతులకు గురిచేసి, తాము చెప్పిన మాటలకే లోబడి ఉండేలా చేశారు. పలుమార్లు ఫోన్ కాల్స్ చేసి వివిధ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇచ్చి, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు బదిలీ చేయాలని మోసగాళ్లు ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి సూచనల మేరకు బాధితురాలు మొత్తం రూ.14 కోట్లను వివిధ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏఎన్ఐతో మాట్లాడిన బాధితురాలు డా. ఇంద్ర తనేజా, పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాతే తమను మోసం చేసిన విషయం తెలిసిందన్నారు. నేను చాలా షాక్ కు గురయ్యా. వాళ్లు ఆడిన నాటకం చాలా నమ్మకంగా అనిపించింది. మాకు సహాయం చేస్తామని చెప్పారని ఆమె అన్నారు. బాధితురాలి భర్త డా. ఓం తనేజా మాట్లాడుతూ, మోసగాళ్లు తమ గురించి చాలా సమాచారం సేకరించినట్లు అనిపించిందన్నారు. వాళ్లకు మా గురించి చాలా వివరాలు తెలుసు. భయంతో మేమూ మా సమాచారం మరింత ఇచ్చేశాం. ఈ మోసంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు.
మాకు చెప్పండి
ఈ ఘటనపై బాధితురాలు జాతీయ సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్వో (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్) సైబర్ క్రైం యూనిట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. తన న్యాయవాది సమక్షంలో రాతపూర్వకంగా పూర్తి ఫిర్యాదు సమర్పించేందుకు బాధితురాలు కొంత సమయం కోరినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పటికీ ఫోన్ ద్వారా అరెస్ట్ చేయవని, ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియే లేదని స్పష్టం చేశారు. అలాగే ఎవరైనా ఫోన్ ద్వారా డబ్బు బదిలీ చేయమని కోరితే వెంటనే అనుమానించి, పోలీసులకు లేదా సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
