
ఢిల్లీలో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్
దేశ రాజధానిలోకి మరో అంతర్జాతీయ అక్రమ ఆయుధాల మాఫియాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసి అదుపులోకి తీసుకుంది. శనివారం పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో నడుస్తున్న ఆయుధాల స్మగ్లింగ్ మాఫియా లక్ష్యంగా చేసిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి టర్కీ తయారీ 5 పిస్టళ్లు, చైనా తయారీ 3 పిస్టళ్లు స్వాధీనం చేసుకుంది.
వివరాలిలా..
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం క్రైమ్ బ్రాంచ్ మొదట ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. విచారణలో, వారు రోహిణిలో ఒకరికి ఆయుధాలు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా బృందం ఇద్దరు రిసీవర్లను పట్టుకుని రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో నిందితుల్లో ఒకరైన పంజాబ్‌కు చెందిన మన్ దీప్ అనే హిస్టరీ షీటర్ సోను ఖత్రి ముఠాతో సంబంధం కలిగి ఉన్నాడని తేలింది. సోనుకు ఆయుధాల స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాలను డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తోంది. డ్రోన్లలో ఒకటి వీడియో ఫుటేజ్‌ను రికార్డ్ చేస్తోంది, మరొకటి ఆయుధాలను చేరవేస్తోంది, వీటిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి కార్బన్ పాలిథిన్‌లో చుట్టారు.
ఈ ముఠా గోగి, కపిల్ సంగ్వాన్ వంటి పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు అధునాతన పద్ధతిలో ఆయుధాలను రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తోంది.
700 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
మరో సంఘటనలో ఢిల్లీ పోలీసులు జిల్లా పోలీసు విభాగాలు, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్వో ) యూనిట్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 700 మందికి పైగా సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం'సైబర్ హాక్' అనే కోడ్‌నేమ్‌తో కూడిన బహుళ-జిల్లాల్లో నిర్వహించిన 48 గంటల ఆపరేషన్, మోసం, ఫిషింగ్, నకిలీ కస్టమర్ కేర్ స్కామ్‌లు, పెట్టుబడి మోసాలు, డిజిటల్ చెల్లింపుల దొంగతనాలలో పాల్గొన్న వ్యవస్థీకృత సైబర్ మోసం నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులను నిర్వహించింది.
ప్రాథమిక దర్యాప్తులో దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన అనుమానాస్పద, మోసపూరిత లావాదేవీలు బయటపడ్డాయి. ఇది దేశ రాజధానిలో కార్యకలాపాలు నడుపుతున్న పెద్ద సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ ముఠాకు భారీ దెబ్బగా అధికారులు పరిగణిస్తున్నారు.
